అటవీశాఖలో అవినీతి చెట్లు
కనిగిరి : ‘కంచే చేను మేసింది’ అన్న చందంగా తయారైంది కనిగిరి అటవీశాఖ పరిస్థితి. అటవీ సంపదను కాపాడాల్సిన అటవీశాఖాధికారులు, సిబ్బంది లంచాల మత్తులో జోగుతూ స్మగ్లర్లతో చేతులు కలుపుతున్నారు. ఏకంగా అధికారులే తమతో కుమ్మక్కవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. కొండంత ఎర్రచందనం స్మగ్లర్ల పాలవుతుంటే గోరంత మాత్రమే అధికారులు పట్టుకుంటూ బాధ్యతగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో దట్టమైన అడవులున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి కర్నూలు, కడప, గుంటూరు జిల్లాల సరిహద్దుల వరకూ విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రకాశంలోని సీఎస్ పురం, వెలిగండ్ల, కనిగిరి, చుండి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం ప్రాంతాలతో పాటు డెల్టా ప్రాంతాలైన ఊళ్లపాలెం, కరేడు, ఉలవపాడు, తెట్టు, గుడ్లూరు, ఈతముక్కల, చినగంజాం ప్రాంతాల్లోనూ అడవులున్నాయి. వాటిలో పశ్చిమ ప్రకాశంలోని అడవుల్లో ఎర్రచందనం, వేగిస, వేప, సిరిమాను, నారవేపి లాంటి చె ట్లు సంమృద్ధిగా ఉన్నాయి. ఎంతో విలువైన ఈ అటవీ సంపదను స్మగ్లర్లు నరికించి చెన్నై, చిత్తూరు, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రధాన నిందితులను పట్టుకోని అధికారులు...
పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, అర్ధవీడు, యర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతంలోని సీఎస్ పురం, మైలుచర్ల, తుంగోడు, వీ బైలు, వెలిగండ్ల తదితర చోట్ల ఖరీదైన ఎర్రచందనం, వేగిస, మారేడు, మద్ది, నారవేపి చెట్లు అధికంగా ఉన్నాయి. ఈ కలపకు మంచి డిమాండ్ ఉండటంతో నిత్యం స్మగ్లర్లు వాటిని నరికి అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఇసుక, బత్తాయి, నిమ్మ, సీతాఫలాల లోడుల్లో వేసి సరిహద్దులు దాటిస్తున్నారు.
అటవీ ప్రాంతం నుంచి సింగరాయకొండ బైపాస్ వైపుగానీ, వేములపాడు ఘాట్‌రోడ్డు మీదుగా కడపవైపుగానీ తరలించి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అలా తరలిస్తూ కొంతమంది ఎర్రచందనంతో సహా పట్టుబడుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్న అటవీశాఖాధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ప్రధాన నిందితులను పట్టుకున్న దాఖలాలు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అవినీతితో పాటు కొందరు రాజకీయ నాయకుల జోక్యం కూడా అందుకు కారణమన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఆరేళ్లలో 90 కేసులు..154 టన్నులు...
గత ఆరేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై 90 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి దాదాపు 154 టన్నుల ఎర్రచందనం దుంగలు, 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2007-08 సంవత్సరంలో 21 కేసులు నమోదవగా, 4,126 దుంగలు (7,1066 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. 2008-09లో 5 కేసులు 710 దుంగలు (1,557 కిలోలు), 2009-10లో 4 కేసులు 354 దుంగలు (8,900 కిలోలు), 2010-11లో 7 కేసులు 307 దుంగలు (6,362 కిలోలు), 2011-12లో 19 కేసులు 177 దుంగలు (27,957 కిలోలు), 2012-13లో 20 కేసులు 1495 దుంగలు (11,689 కిలోలు), 2013-14లో 6 కేసులు 140 దుంగలు (4,500 కిలోలు), 2014-15లో మైలుచర్ల, తుంగోడు, భైరవకోన బీట్లలో సుమారు 400 దుంగల వరకూ అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. అయితే, వీటికి రెండింతలకుపైగా అక్రమంగా తరలివెళ్లినట్లు సమాచారం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అవినీతికి పాల్పడటం వల్లే విలువైన అటవీ సంపద స్మగ్లర్ల పాలవుతున్నట్లు తెలుస్తోంది.
వీడని దుంగల మాయం కేసు...
2012 జూలై 5న కనిగిరి అటవీ రేంజ్ కార్యాలయంలో ఉన్న సుమారు రూ.8 లక్షల విలువైన 130 ఎర్రచందనం దుంగలు అపహరణకు గురయ్యాయి. తుంగోడు, వెదుళ్ల చెరువు, చెన్నపునాయునిపల్లె బీట్‌లలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలను కార్యాలయంలో ఉంచగా రాత్రికిరాత్రే అవి మాయమయ్యాయి. అప్పట్లో ఈ సంఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. అటవీశాఖాధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసు జాగిలాలను సంఘటన స్థలానికి తీసుకువచ్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక చర్యగా వాచ్‌మన్‌ను సస్పెండ్ చేసి మమ అనిపించారు. డీఎఫ్‌వో స్థాయి అధికారి విచారణ జరిపినప్పటికీ నేటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు.