అరెస్టుల పర్వంలో ...అదే వరుస !
- భాకరాపేట తరహాలో చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్
- అందులోనూ టీడీపీ ప్రచారకార్యదర్శి వసంత్‌తో పాటు మధు పేరు
- ‘సాక్షి’ కథనంతో జిల్లా నుంచి వసంత్ పరార్.. అదే బాటలో మరికొందరు
- నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం...
- ‘పచ్చ’ నేతలకు బెయిల్ వచ్చే అవకాశం
భాకరాపేట...చిత్తూరు టూ టౌన్. ఊరు ఏదైనా అరెస్టుల పర్వంలో అదే తంతు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లోని ప్రధాన నిందితుల అరెస్టులో నిర్లిప్తత కొనసాగుతోంది. పోలీసులపై అధికారపార్టీ ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్, ఆపార్టీ నేత మధుపై ఎఫ్‌ఐఆర్ నమోదై కళ్లెదుట తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. అలాంటి వ్యవహారం చిత్తూరు టూ టౌన్‌లో జరిగింది. ఇక్కడ కూడా వారిపై కేసులు నమోదైనా పోలీసులు అరెస్టు చేయలేదు. అరెస్టుల పర్వంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుల జాబితాలో మరో నలుగురి పేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగల విచారణలో మరో నలుగురు దొంగలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో మొన్నటి వరకూ 196గా ఉన్న సంఖ్య 200కు చేరినట్లయింది. జాబితాలో చేరిన ఆ నలుగురు స్మగ్లర్లు తమిళనాడువాసులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
చిత్తూరు టూటౌన్‌లోనూ అదే సీన్..
టీడీపీ జిల్లా ప్రచారకార్యదర్శి వసంత్‌కుమార్, ఆ పార్టీ నేత మధుతో పాటు 19మంది ఎర్రచందనం దొంగలపై ఈ నెల 13న భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. వసంత్, మధు జిల్లాలో తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే వీరిని అరెస్టు చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసు కవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో వసంత్, మధుతో పాటు జిల్లాకు సంబంధించిన జాబితాలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు.
అయితే భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కూడా ఈ నెల 13నే 16మంది ఎర్రచందనం స్మగ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. సెక్షన్‌యు/ఎస్379, 109ఐపీసీఆర్/డబ్ల్యూ మరియు ఏపీ ఫారెస్ట్‌యాక్ట్ 1967 సెక్షన్ 29, 32తో పాటు ఎర్రచందనం అక్రమరవాణా, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు పలు సెక్షన్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిసింది.
భాకరాపేటలో ఎఫ్‌ఐఆర్ నమోదైన 19 మందిలోని 11 మంది వ్యక్తులపై చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. వీరిపై మరో కేసు ఉంటే పీడీయాక్టు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే 13 నుంచి భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసులు కూడా వీరి అరెస్టుపై దూకుడు ప్రదర్శించలేదు. దీనికి కారణం కూడా ‘పచ్చ’ నేతలకు ‘ప్రభుత్వ’ అండ ఉండటమే అని తెలుస్తోంది.
ఇప్పటి వరకూ 84మంది స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం స్మగర్ల అరెస్టులు, కూంబింగ్‌లో వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వీరి పరిధిలో ఈ నెల 22 వరకూ 80 మంది దొంగలు ఉన్నట్లు తెలిసింది. సోమవారం ఎర్రావారిపాళెం పరిధిలో మరో నలుగురు అరెస్టయ్యారు. దీంతో ఈ సంఖ్య 84కు చేరింది. తక్కిన 116 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఇద్దరు ఏఎస్పీలు, 20మంది సీఐలు, వందమంది పోలీసులు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. వీరు మరో స్మగ్లర్ ఆరని రమేష్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రమేష్‌పై భాకరాపేట పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై చిత్తూరు టూటౌన్ ఎస్‌ఐ లక్ష్మణరెడ్డిని వివరణ కోరగా వారం రోజులుగా తాను ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఉన్నానని తెలిపారు.
నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం
పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం మంగళవారం జరగనుంది. ఇప్పటి వరకూ పీడీయాక్టు నమోదైన 14మంది స్మగ్లర్లతో పాటు ఇంకెవరిపై పీడీయాక్టు నమోదు చేయాలి? అనే కోణంలో విచారణ జరగనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన దొం గలుగా ఉన్న రెడ్డినారాయణ, మహేశ్‌నాయుడు భార్యలు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడును కలిసిన సంగతి తెలిసిందే! పార్టీ కోసం తమ భర్తలు పనిచేశారని, భారీగా డబ్బు కూడా ఖర్చు చేశారని, వారిని కేసుల నుంచి ఎలాగైనా తప్పించాలని వారు కోరినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు కూడా వారికి ‘అభయం’ ఇచ్చినట్లు తెలిసిం ది. దీంతో ఆ ఇద్దరికీ బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.