చేయితడిపితే రైట్ రైట్
అటవీ సంపదను కాపాడాల్సిన అటవీ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులను అడ్డుపెట్టుకుని మూమూలు కలప వ్యాపారుల నుంచి మామూళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెక్‌పోస్టుల్లో చేయితడిపితే వాహనాలకు రైట్ చెబుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు.
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు రేంజ్ పరిధిలో అటవీశాఖ సిబ్బంది కొందరు ప్రైవేట్ వ్యక్తులను అడ్డుపెట్టుని అక్రమాలకు పాల్పడుతున్నారు. మామూలు కలపను తరలించే వ్యాపారుల వద్ద మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తాము ప్రత్యేక అధికారులమని, స్క్వాడ్ బృందంలో సభ్యులమని ప్రైవేటు వ్యక్తులు దబాయిస్తున్నారు. అటవీశాఖ సిబ్బందే అక్రమాలకు పాల్పడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలప వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా సరిహద్దులు నుంచి సంగం వరకు ఆత్మకూరు రేంజ్ పరిధి. అటవీ శాఖ చెక్‌పోస్టుల వద్ద వాచ్‌మెన్లు, డీఆర్‌ఓలు విధులు నిర్వహిస్తుంటారు. కృష్ణాపురం చెక్‌పోస్టు వద్ద కొద్ది రోజులుగా జామాయిల్, చిల్లకర్ర తరలించే వ్యాపారుల వద్ద సిబ్బంది వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి నగదు తీసుకుని వాహనాలకు రైట్ చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గానికి ఎలాంటి సంబంధం లేని దుత్తలూరు మండలానికి చెందిన ఓ వాచర్, డీఆర్వో కృష్ణాపురం ప్రాంతంలో తమ పరిచయాలను ఉపయోగించి వాహనాలను తప్పిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పొగాకు క్యూరింగ్ జరుగుతున్న క్రమంలో రైతులు కలపను బ్యారెన్ల వద్దకు తరలిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది రైతుల వాహనాలను సైతం ఆపి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం ఆత్మకూరు రేంజ్ కార్యాలయంలో చర్చ జరిగినట్లు సమాచారం. అటవీశాఖ సిబ్బంది అక్రమాలపై రేంజర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాగా ఈ విషయమై ఆత్మకూరు రేంజర్ రామకొండారెడ్డిని సంప్రదించగా ఎలాంటి స్క్వాడ్, ప్రత్యేక నిఘా బందాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై విచారించి ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకుం టామన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా వసూళ్లకు పాల్పడుతుంటే సమాచారం ఇవ్వాలని కోరారు.