ప్రాణం పోయినా.. అడవిని వీడం!
బయటికి వెళితే మేం బతికేదెలా?
♦ పులుల అభయారణ్యాల్లోని గిరిజనుల ఆవేదన
♦ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలకు లొంగబోం
♦ ప్రభుత్వమిచ్చే రూ. 10 లక్షలకు రెండెకరాలు రాదు
♦ అటవీ భూముల సాగుకే హక్కులు కల్పించాలని చెంచుల డిమాండ్
♦ టైగర్ రిజర్వు నుంచి వెళ్లిపోయేందుకు గిరిజనేతరుల సుముఖత
♦ దరఖాస్తు చేసుకున్నవారితో జాబితాలు రూపొందిస్తున్న అధికారులు
‘‘అడవిలో పుట్టినం.. అడవిలోనే ఉంటం.. నీళ్లలో ఉన్న చేపను ఒడ్డు మీద వేసినట్లే మమ్మల్ని బయటికి పంపితే బతుకులు ఆగమవుతయి.. బయటకెళితే మాకేం పని దొరుకుతుంది. ఇక్కడుంటే అడవి ఉత్పత్తులు తెచ్చుకుని బతుకుతాం.. వారు ఇస్తామంటున్న రూ. 10 లక్షలు కాదు.. రూ. 20 లక్షలు ఇచ్చినా తలొగ్గం. ప్రాణం పోయినా అడవిని వీడి వెళ్లం..’’ - పులుల అభయారణ్యాల్లోని గిరిజనుల ఆవేదన ఇది.
అచ్చంపేట: పులుల అభయారణ్యాల నుంచి గిరిజన కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతమైంది. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యంలోని వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు, ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోని మలియాల, మైసంపేట, రాంపూర్, దొంగపల్లి, గుడ్లపెంట గ్రామాలను ప్రభుత్వం తరలింపు జాబితాలో చేర్చింది. అయితే మొదట చెంచులను కాకుండా ఇతరులను బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రెండు గ్రామాల జాబితా సిద్ధం
అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతం నుంచి తరలించే వాటిలో సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల జాబితా సిద్ధమైంది. ఇక్కడ చెంచులు మినహా ఇతరులు కొందరు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అటవీ, రెవెన్యూ శాఖలు సర్వే నిర్వహించి లబ్ధిదారుల జాబితాలను రూపొందించాయి. ఈ రెండు గ్రామాల ప్రజలకు వ్యవసాయ భూమి ఉన్నా పట్టాలు లేవు. ఎప్పటినుంచో పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా.. ప్రభుత్వం ఇవ్వలేదు. దీనికితోడు నిత్యం అధికారుల బెదిరింపులకు భయపడుతూ ఉండే కంటే బయటికి వెళ్లడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం బయటకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ప్రభుత్వమిచ్చే రూ. 10 లక్షలకు ఎక్కడా రెండెకరాల భూమి కూడా రాదని వారు చెబుతున్నారు. తమకున్న ఎకరా, రెండెకరాల పట్టా భూమితోపాటు అటవీ భూములను ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని... ఆ భూములకు అటవీహక్కుల చట్టం కింద హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ మూడు గ్రామాల్లో: వట్టువర్లపల్లిలో 2004లో 239 కుటుంబాలుంటే ప్రస్తుతం 536 కుటుంబాల్లో 2,160 మంది ఉన్నారు. ఇందులో 17 చెంచుల కుటుంబాలు. గ్రామంలో మొత్తం 850 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో 200 ఎకరాలు శ్రీశైలం ఉత్తర ద్వారమైన శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయం పేరు మీద ఉన్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. ఈ భూమి ప్రస్తుతం ఇతరుల అధీనంలో ఉంది. దానిని దేవాదాయశాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పట్టా భూమి కాకుండా ఇక్కడి రైతులు మరో వెయ్యి ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఈ గ్రామం నుంచి బయటికి వెళ్లేందుకు 400 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ చెంచులు మాత్రం అడుగు కూడా ముందుకు కదలమని చెబుతున్నారు.
ఇక సార్లపల్లిలో 195 కుటుంబాలుండగా.. జనాభా 469. అందులో 70 చెంచు కుటుంబాలు. ఇక్కడ ప్రతి కుటుంబానికి 3 నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చెంచు కుటుంబాలకు రెవెన్యూ, అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చారు. ఇతరుల భూములకు ఎలాంటి పట్టాలు లేవు. అలాంటి 125 ఇతర కుటుంబాల వారు ఇక్కడి నుంచి వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు. కుడిచింతలబైలులో మొత్తం 100 కుటుం బాలుంటే 319 జనాభా ఉంది. అందులో 25 చెంచు కుటుం బాలు. ఇక్కడ ప్రతి కుటుంబానికి 5 నుంచి 8 ఎకరాల భూమి ఉంది. చెంచులకు మినహా ఇతరుల భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు లేవు. అలాంటి 75 కుటుంబాలు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకున్నాయి.
పునరావాసంపై దృష్టి
అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతం నుంచి తరలించే వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడం కోసం సాగుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేటివ్ సొసైటీ (హైటికాస్) ఆధ్వర్యంలో ఈ మూడు గ్రామాల నుంచి 15 మందిని ఎంపిక చేసి, వివిధ ప్రాంతాలకు తీసికెళ్లి భూములు చూపించారు. జిల్లాలో సాగుకు అనుకూలమైన భూములు రెవెన్యూ శాఖ వద్ద అందుబాటులో లేకపోవడంతో అటవీ శాఖ భూములను పరిశీలిస్తున్నారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారం, చేవెళ్ల, రుసుల చెరువు ప్రాంతాలను గుర్తించారు.
కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఇదీ..
జాతీయ పులుల సంరక్షణ పథకం-2008 చట్టాన్ని అనుసరించి రెండు రకాల ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో మొదటిది కుటుంబం కోరితే రూ. 10 లక్షలు చెల్లిస్తారు. దీనిలో అటవీశాఖ నుంచి పునరావాస చర్యలు ఉండవు. ఇక రెండోది పునరావసం కోసం నివాస ప్రాంతాన్ని కోరితే అటవీ శాఖ ఇచ్చే రూ. 10 లక్షల్లో ఒక కుటుం బానికి రెండు హెక్టార్ల (5ఎకరాల) వ్యవసాయ భూమి (35 శాతం), పునరావాసం కింద హక్కులు పొందేం దుకు రూ. 3 లక్షల బ్యాంకు డిపాజిట్(30 శాతం), రూ. 50 వేల నగదు ప్రోత్సాహకం (5 శాతం), గృహ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు (20 శాతం), సామూహిక సౌకర్యాల కోసం మిగతా సొమ్ము ఖర్చు చేస్తారు. ఇక వ్యక్తిగతంగా పట్టా భూములు, ఇళ్లు కలిగిన వారికి అదనంగా పరిహారం చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా... పునరావాస ప్యాకేజీలో గృహ నిర్మాణం కోసం ఇచ్చే 20 శాతం సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు.
నీళ్లలోంచి చేపను బయటేసినట్లే
మా ఊరు నుంచి మమ్ములను దూరం చేస్తే నీళ్లల్లో ఉన్న చేపలను తీసి బయటవేసినట్లే. అడవిని విడిచిపెట్టి ఎక్కడికి పోయినా మా చెంచు జాతి బతకలేదు. ఇప్పటికే తరలింపు పేరుతో అభివృద్ధికి దూరమై నష్టపోయినం. వేరే గ్రామాల్లో లోన్లు, వ్యవసాయ పొలాల్లో బోర్లు వేసిండ్రు. గ్రామం తరలిస్తుండ్రని మాకు ఇవ్వడం లేదు. మాకు మాత్రం ఇక్కడనే ఎద్దులు ఇచ్చినట్లైతే పొలాలు చేసుకుని మా పిల్లలను చదివించుకుని బతుకుతాం.
- చిగుర్ల పోతయ్య,సార్లపల్లి వార్డు సభ్యుడు
వట్టువర్లపల్లిలో సర్వే చేయలేదు
వట్టువర్లపల్లిలో సర్వే చేయలేదు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి గ్రామసభ ద్వారా అగ్రిమెంటు తీసుకుంటాం. సార్లపల్లి, కుడిచింతలబైలు లో సర్వే పూర్తి చేసి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశాం. వట్టువర్లపల్లి రెవెన్యూ అధికారుల సహకారంతో అటవీ శాఖ జాయింట్ సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎన్జీవో ద్వారా వారికి కర్ణాటక, మహారాష్ట్రలోని పునరావాస ప్రాంతాలను చూపించా. వారికి నచ్చిన ప్రాం తాల్లో పునరావాసం కల్పిస్తాం.
- బాలస్వామి,అచ్చంపేట డీఎఫ్‌వో