అటవీ అధికారుల మాయ..!
పట్టుకున్నది ఎక్కువ..తరలించింది తక్కువ
మీడియా దృష్టికి రావడంతో రాత్రికి రాత్రే కార్యాలయానికి చేర్చివేత
చర్చనీయాంశంగా మారిన అధికారుల తీరు
ములుగు : గృహ అవసరాల నిమిత్తం కలపను తరలిస్తున్న వారిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టుకున్నది కొండంత అయితే అటవీ కార్యాలయానికి మాత్రం కొంత మాత్రమే తరలించి మిగతాది స్వాహా చేద్దామనుకున్నారు. ఇంతలోనే గుట్టు రట్టవడంతో స్వాహా చేద్దామనుకున్న కర్రను తీసుకొచ్చారని తెలిసింది. ఈ తతంగంపై అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సైతం విచారణ చేపట్టినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11న నల్లబెల్లి మండలం మేడపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి మూడు ఎడ్లబండ్ల ద్వారా రాత్రి పూట ఇంటి అవసరాలకు కలపను తరలిస్తున్నారు.
ములుగు మండలం సర్వాపురం సమీపంలో తోగు వద్ద ఎడ్లకు నీళ్లు తాగిస్తుండగా కొంత మంది స్థానికులు కలపను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్షన్ అధికారి హట్కర్ రమేశ్, బీట్ అధికారి హనుమ, ఇతర సిబ్బంది రాయినిగూడెం సమీపంలో ఎడ్ల బండ్ల ద్వారా తరలిస్తున్న కలపను పట్టుకున్నారు. ఎడ్లు నడిచే పరిస్థితి లేకపోవడంతో రెండు ట్రాక్టర్లలో కలపను వేసుకొని ములుగు అటవీ కార్యాలయానికి తరలించారు.కలపను తరలిస్తున్న వారితో రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకోవడానికి అధికారులు ప్రయత్నించినా ఫలించలేదని తెలిసింది. దీంతో కర్ర తరలిస్తున్న వారిని ముప్పు తిప్పులు పెట్టినట్లు సమాచారం. వారిని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు గుంజడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
కలప మాయమైంది ఇలా..
కలపను పట్టుకున్న అధికారులు కొంత మొత్తం మాత్రమే ములుగు కార్యాలయానికి తరలించారు. ఇందులో కేవలం 30 దుంగలు, దూలాలు మాత్రమే ఉన్నాయి. మిగతా మూడు దూలాలు, 30 పెద్దేగి సైజులు, మూడు చెక్కలను కొత్తూరు, దేవగిరిపట్నంలో దాచి ఉంచినట్లు సమాచారం. పట్టుకున్న కలపను మొ త్తం తీసుకురాకుండా రెండొంతులు మధ్యలో లాక్కున్నారని కలప తరలిస్తున్న వారు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆదివారం రాత్రి దాచిన కలప దుంగలను ములుగు కార్యాలయానికి తరలించారని తెలిసింది.
నాలుగు రోజులుగా మూగ జీవాల రోదన
గత శుక్రవారం రాత్రి పట్టుకున్న ఎడ్ల బండ్లను అధికారులు ములుగు అటవీ కార్యాలయానికి తరలించారు. అదే రోజు కేసు నమోదు చేసి పంపిచాల్సిన అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు. నాలుగు రోజులుగా మూగజీవాలు మంచినీటికి , మేతకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇదే విషయమై రైతులు అధికారులను ఎన్ని సార్లు వేడుకున్నా పట్టించుకోలేదని కర్ర తరలించిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పట్టుకున్న ఎడ్లబండ్లు, పశువులను కేసు నమోదు చేసి వదలిపెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఫ్లయింగ్ స్క్వాడ్ విచారణ
పట్టుకున్న కలపలో కొంత కలపను దాచిన విషయం బయటకు పొక్కడంతో సోమవారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారి సందీప్ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. సంబంధిత సెక్షన్ అధికారి, బీట్ అధికారితో పాటు ఇతర సిబ్బందిని విచారించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు జరిగిన పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి చిన్న విషయంలో శాఖ పరమైన నిబంధనల ప్రకారం స్పందించే అటవీ శాఖ తమ సొంత శాఖ సిబ్బంది తీరుపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అంశం.