పగులు ఉన్న ప్రాంతం
శివాజీనగర(కర్ణాటక): బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్‌లో కనిపించిన చీలికను సరిచేసిన కొన్ని నెలల అనంతరం తాజాగా మరో చోట చీలిక కనిపించింది. సౌత్ ఎండ్ సర్కిల్ పిల్లర్ ఒకటిలో చీలిక కనిపించిన సమాచారం మెట్రో రైలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అయితే బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేఠ్ ఈ విషయంపై రైలు ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శుక్రవారం ఉదయం బసవనగుడి సమీపంలో ఉన్న సౌత్ ఎండ్ సర్కిల్‌లో పిల్లర్‌లో చీలిక కనిపించిందన్న సమాచారం క్షణంలోనే అన్ని వైపుల వ్యాపించి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.
తక్షణమే స్థలానికి చేరుకున్న బీఎంఆర్‌సీఎల్ అధికారులు మెట్రోలోని ఈ స్థలంలో ఏ చీలిక కనిపించలేదని స్పష్టం చేసి ప్రయాణికుల్లో ధైర్యాన్ని నింపారు. మెట్రో రెండో విడత పిల్లర్ యొక్క ఒక బేరింగ్ మాత్రం కిందకు పడింది. దానిని తక్షణమే సరిచేశారు. మెట్రో రైలు మార్గంలో అన్ని పిల్లర్‌లలో బేరింగ్‌లు కిందకు పడటం సాధారణంగా జరుగుతుంది. దీనిని అప్పుడప్పుడు సరిచేస్తామని, అదే విధంగా ఈ భాగంలో బేరింగ్‌ను సరిచేస్తామని బీఎంఆర్‌సీఎల్ ప్రజా సంప్రదింపుల అధికారి యశ్వంత్ తెలియజేశారు. ఇంతకు ముందు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్‌లో చీలిక ఏర్పడటంతో ఆ మార్గంలో రైలు ప్రయాణాన్ని రద్దు చేసి మరమ్మతులు చేపట్టిన విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment