
భువనేశ్వర్: ట్రాఫిక్‌జామ్ కారణంగా ఓ పసివాని ప్రాణాలు పోయిన సంఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆతృతతో బయల్దేరినా ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. మంగళవారం ఉదయం ఈ విచారకర సంఘటన చోటుచేసుకోగా ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుడితో ఆ బాలుడికి చికిత్స అందజేశారు. సోమవారం రాత్రి అయినా ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి సిఫారసు చేశారు.
కటక్ చేరడంలో ఆలస్యం జరిగితే బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భయంతో చేరువలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం అంబులెన్స్‌లో హుటాహుటినా బాలుడితో కుటుంబ సభ్యులు బయలుదేరారు. అలా వెళ్లే దారిలో ఓ చోట ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆ ట్రాఫిక్‌లో బాలుడు ఉన్న అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఎంతసేపటికీ ఆ అంబులెన్స్‌కు దారి దొకరకకపోవడంతో అందులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డ అంబులెన్స్‌లోనే మృతి చెందాడని బాధిత కుటుంబీకులు బోరుమంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ సందర్భాల్లో అంబులెన్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నిరవధికంగా దూసుకుపోయే అవకాశం కల్పించలేని ప్రభుత్వం, ట్రాఫిక్ వ్యవస్థ పట్ల సాధారణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన పూర్వాపరాలు సమీక్షించిన తర్వాత స్పందిస్తామని ట్రాఫిక్ డీసీపీ సాగరిక నాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment