బాడంగి: విద్యుత్ స్తంభం రూపంలో విధి ఓ చిన్నారిని బలిగొంది. రోడ్డు మీద ఆట ఆడుకుంటున్న పసివాడిపై అక్కసు తీర్చుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు తీవ్ర విషాదం నింపింది. హృదయ విదారకరమైన ఈ సంఘటన గురువారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకోంది. కరెంట్ తీగలను టిప్పర్ లాగేయడంతో విద్యుత్ స్తంభం పడి తీవ్ర గాయాలపాలైన బాలుడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ వి.పాపారావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన పొడుగు నాగరాజు సైకిల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి యశ్వంత్ (4), భరత్(2) అనే ఇద్దరు కుమారులు.
ఇక్కడి కూరాకుల వీధిలో వీరబ్రహ్మం గారి ఆలయం సమీపంలో స్టోన్‌క్రషర్ బుగ్గి తెచ్చిన టిప్పరు అన్‌లోడ్ చేసే క్రమంలో విద్యుత్ వైరు ట్రక్ కొక్కేనికి చిక్కుకుంది. గమనించని డ్రైవర్ ట్రిప్పర్‌ను ముందుకు లాగించగా విద్యుత్ స్తంభం విరిగి అక్కడే ఆడుకుంటున్న యశ్వంత్ (4)పై పడింది. తీవ్రగాయాలపాలైన బాలుడ్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించాలని సూచించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేయగా కొన ఊపిరితో ఉన్న బాలుడ్ని తిరిగి గ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. యశ్వంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఎంతో ముద్దుగా పెంచాం
కుమారులు ఇద్దరిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఇంతలో జరగరాని సంఘటన జరిగిపోయిందని త ల్లితండ్రులు సంతోషి, నాగరాజు బోరునవిలపించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు వారి రోదనను చూసి కంటతడి పెట్టారు. నాగరాజు అన్నయ్య శ్రీను గృహప్రవేశ కార్యక్రమం గురువారం రాత్రే జరగాల్సి ఉండగా.. ఇంతలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తప్పిన ప్రమాదం
ప్రమాద సమాచారం అందుకున్న విద్యుత్‌శాఖ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అదే కండక్టరు వైరు అయితే తీవ్ర నష్టం జరిగేదని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు.
చిన్నారిని బలిగొన్న విద్యుత్ స్తంభం
Published Sat, Feb 27 2016 1:14 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement