ఆలియా మృతదేహాన్ని తీసుకెళ్తున్న మహబూబ్‌బాషా, స్ట్రెచర్ లేక బిడ్డ మృతదేహాన్ని చేతులపై తీసుకెళ్లుతున్న దృశ్యం
ఆడపిల్లను భారంగా భావించే రోజులు..ముగ్గురు బంగారు తల్లులు.రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప..పూట గడవని కుటుంబం.పిల్లల చిరునవ్వులే..ఆ ఇంట్లో వెలుగు దివ్వెలు.పట్టుమని పదేళ్లు కూడా లేవు..ఇద్దరు పిల్లలను మృత్యువు కబలించింది.కళ్లెదుటే ఒక్కో ప్రాణం నిలిచిపోయింది..కన్నపేగు విలవిల్లాడింది.అల్లారుముద్దుగా పెంపకం..ఆ ఇంటి పెద్ద హృదయం ముక్కలైంది.తల్లి కంట్లో కన్నీటి సుడులు..
తండ్రి చేతుల్లో కంటి పాపలు..మూడంతస్తుల మేడ..ఒక్కో మెట్టూ కరిగిపోయింది.రాలిన పూల సాక్షిగా..ప్రభుత్వాసుపత్రి మూగబోయింది.
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో గురువారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృత్యువొడి చేరారు. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల కళ్లముందే రక్తం కక్కుకుని మృతి చెందిన ఘటనతో ఆసుపత్రి ఆవరణ మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. పెనుకొండ పట్టణంలోని బీటీఆర్ కాలనీకి చెందిన మహబూబ్‌బాషా, షబానా దంపతులకు గౌసియా(8), హర్షియా (4), ఆలియా(2) సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే ఆయినా మహబూబ్‌బాషా ఏమాత్రం దిగులు చెందలేదు. భార్యతో కలిసి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బట్టీల వద్ద పనిలేనప్పుడు కార్పెంటర్ల వద్ద కూలీ పనులకు వెళ్లేవాడు. బాషా రెక్కాడితేనే ఆ ఇంట్లో పిల్లల డొక్క నిండుతుంది. అయినప్పటికీ బిడ్డలందరినీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పెద్దకుమార్తె గౌసియా(8) పుట్టుకతో డౌన్‌సిండ్రోమ్(జన్యుపరమైన సమస్య)తో బాధపడుతుండగా.. తన శక్తిమేరకు చికిత్స చేయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే చిన్న అమ్మాయి ఆలియా(2) కూడా పదిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు గౌసియాకు కూడా తీవ్ర జ్వరం రావడంతో భయాందోళన చెందిన మహబూబ్‌బాషా ఈ నెల 25న పెనుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. అయితే అక్కడి వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే మందులురాసి ఇంటికి పంపాడు. ఇంటికెళ్లాక ఇద్దరు పిల్లలకు మందులు వేయగా.. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో హుటాహుటిన చిన్నారులిద్దరినీ కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. 26వ తేదీ ఉదయం 1.45 గంటల సమయంలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే గౌసియా నోరు, ముక్కు నుంచి రక్తాస్రావం అవుతోంది. వైద్యులు పరీక్షించి, బ్లీడింగ్ డయాతసిస్‌గా నిర్ధారణకు వచ్చారు. రక్తం ఆగేందుకు మందులు పెట్టారు. అలాగే ఆలియాకు జ్వరం తగ్గేందుకు చికిత్స చేశారు. అయితే ఉదయం 10.10 గంటల సమయంలో గౌసియాకు ఫిట్స్‌రాగా ఆ అమ్మాయి కాసేపటికి మృతి చెందింది. గౌసియా గొంతులో వాపు రావడం కంఠసర్పి లక్షణాలను తలపిస్తోంది.
‘‘యా అల్లా’’ ఎంత పనిచేశావయ్యా..
తమ కళ్లముందే చనిపోయిన ఇద్దరు బిడ్డలను చూసి మహబూబ్‌బాషా, షబానాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు పిల్లలు మంచంపై రక్తం కక్కుని పడి ఉండడాన్ని చూసి తల్లి షబానా బోరున విలపించింది. ‘‘యా అల్లా’’ ఎంత పని చేశావయ్యా... అంటూ విలపించింది. ఆలియా ‘‘భేటీ ఉఠో..ఉఠో’’ అంటూ ఆమె విలపించిన తీరు చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.
పెంచిన చేతులతోనే...
మృతి చెందిన చిన్నారులను ఆస్పత్రి నుంచి అంబులెన్స్ వరకు తరలించడానికి కనీసం స్ట్రెచ్చర్ కూడా లేని పరిస్థితి. చిన్నపిల్లల విభాగంలో స్ట్రెచ్చర్, వీల్‌చైర్లు లేకపోవడం.. అక్కడ నాల్గో తరగతి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులే ప్రాణం లేని ఆ పసిబిడ్డలను మూడో అంతస్తు నుంచి కిందవరకూ చేతుల్లోనే మోసుకువెళ్లారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు..గానీ ఆస్పత్రి సిబ్బందిలోని ఏ ఒక్కరూ వారికి కనీస సాయం చేయలేకపోయారు. అలా బిడ్డలను చేతులమీదే కిందకు తీసుకువచ్చిన మహబూబ్‌బాషా దంపతులు మహాప్రస్థానం వాహనంలో ఇంటికి తీసుకువెళ్లారు.
వ్యాధి నిరారించడంలో వైద్యుల విఫలం
గౌసియా, ఆలియా మృతి ఘటనలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పెనుకొండ, హిందూపురం ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రమాదకర కేసులను తేలిగ్గా తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం వ్యాధి నిర్ధారించలేనట్లు అవగతమవుతోంది. చివరి నిమిషంలో సర్వజనాస్పత్రికి పంపి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడినట్లు తెలుస్తోంది. ప్రారంభంలోనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువచ్చింటే చిన్నారులకు మెరుగైన వైద్యం అందేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
అక్క వెంటే చెల్లి...
నిమోనియా, మాల్ న్యూట్రీషియన్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ఆలియాకు వైద్యులు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. ఆ సమయంలో గౌసియా చనిపోవడంతో కన్నీరుమున్నీరైన తల్లి.. చిన్నకుమార్తె ఆలియా ఆక్సిజన్ మాస్క్ తొలగించి బయటకు తీసుకెళ్లింది. దీంతో వెంటనే ఆలియా నోరు, ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఆ కొద్దిసేపటికే ఆలియా కూడా మృతి చెందింది.
శోకసంద్రంలో పెనుకొండ
పెనుకొండ: గౌసియా, ఆలియా మృతి వార్త తెలిసిన వెంటనే పెనుకొండలోని బీటీఆర్ కాలనీకి తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను తీసుకురాగానే బంధువులు, సమీప ప్రాంతాల వారు మహబూబ్‌బాషా ఇంటికి తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న చిన్నారులు చూసి చలించిపోయారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి సాయంత్రం వేళ చిన్నారులిద్దరినీ ఖననం చేశారు. కాగా, ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారని తెలుసుకున్న పోలీసులు మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఫిట్స్, నిమోనియాతో పిల్లలు మృతి
గౌసియా జన్యుపరమైన సమస్య(డౌన్‌సిండ్రోమ్) బ్లీడింగ్ డయాతసిస్‌తో బాధపడుతూ అడ్మిట్ అయ్యింది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావమయ్యే సమయంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో గుండె, ఊపిరితిత్తులు పనిచేయక మృతి చెందింది. ఆలియా నిమోనియాతో పాటు మాల్ న్యూట్రీషియన్(పౌష్టికాహారం లోపం)తో బాధపడుతోంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో మృతి చెందింది.– డాక్టర్ మల్లీశ్వరి(హెచ్‌ఓడీ)
Comments
Please login to add a commentAdd a comment