సంఘటన స్థలం వద్ద గుమిగూడిన స్థానికులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ,ప్రాణమిత్రులు మనోజ్, చరణ్ (ఫైల్)
తరగతులు వేరైనా తరగని బంధం వారిది.. ఎక్కడికి వెళ్లినా ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిందే.. ఆ అనుబంధమే ఇద్దరు బాలలను ఒకేసారి మృత్యు కోరల్లోకి నెట్టివేసింది.. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రుల గుండె చెరువైంది.
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ఇద్దరూ ఒక తరగతి కాదు.. ఒక వయసు వారు కాదు.. కానీ మనసు ఒకటే. బడికి వెళ్లినా.. ఆటపాటలకు వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అదే అనుబంధం మృత్యువులోనూ కొనసాగడం వారి కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కాశీబుగ్గ–మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రాజపురం గ్రామంలోని గండుగోపాల సాగరం(చెరువు)లో పడి ఆదివారం ఇద్దరు బాలలు మృతి చెందిన ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. బమ్మిడి బాలరాజు కుమారుడు బమ్మిడి మనోజ్ కుమార్ (13), శాసనపురి శ్యాంసుందర్ కుమారుడు శాసనపురి చరణ్ (జితేంద్ర)(10) చినబడం మారుతీనగర్‌లో పక్క పక్క ఇళ్లలో నివసిస్తున్నారు.
ఆదివారం సెలవు రోజు కావడంతో గ్రామంలో ఆడుకుంటూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి కూడా చేరకుండా ఈత కొట్టడానికి సైకిల్‌పైచెరువు వద్దకు చేరుకున్నారు. ఎండలో ఆటలేమిటని స్థానికులు కొందరు వారించినా నీటిలోకి దిగి ఈతనేర్చుకుంటూ ఒకరిని ఒకరు పట్టుకుని చనిపోయారని పోలీసులకు స్థానికులు తెలిపారు. వారి దుస్తులను బట్టి స్థానికులు వెదకడంతో ఒకరి కాలు దొరకగా బయటకు తీశారు. మరో బాలుడు కూడా కొద్దిసేపటికి దొరికాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఇద్దరి చిన్నారుల మృతదేహాలను చూసి బోరుమని విలపించారు. సంఘటన స్థలానికి నందిగాం సీఐ మల్లా శేషు చేరుకొని కాశీబుగ్గ పోలీసు సిబ్బందితో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పలాస సామాజిక ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న బమ్మిడి మనోజ్‌కుమార్‌కు అమ్మా నాన్న, చెల్లి ఉన్నారు. శాశనపురి చరణ్ (జితేంద్ర) తండ్రి విశ్వబ్రాహ్మణ పనులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు.
విషాద వదనంతో మనోజ్ సోదరి
మనోజ్‌కుమార్, అతని సోదరి బమ్మిడి మౌనిక కవల పిల్లలు. ఇద్దరూ 14 ఏళ్ల క్రితం బమ్మిడి బాలరాజు దంపతులకు జన్మించారు. ఇద్దరి పుట్టిన నక్షత్రాలు ఒక్కటే కావడంతో ఇద్దరికి మ అక్షరంతో పేర్లు పెట్టుకున్నారు. మనోజ్ మరణించడంతో దిక్కుతోచని స్థితికి మౌనిక చేరుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
రియల్ ఎస్టేట్‌కు మట్టి తరలించడమే కారణం
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఇటీవల అర్ధరాత్రి మట్టి తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ తవ్వకాల వల్ల చెరువు మరీ లోతుగా మారింది. ఈ విషయాన్ని ఊహించని చిన్నారులిద్దరూ మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment