వత్సవాయి ప్రమాదంలో ఘటనా స్థలి వద్ద విద్యార్థి జాన్‌బాషా మృతదేహం
సాక్షి, అమరావతి బ్యూరో : స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ లేకపోవడం, నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో, జిల్లాలో రోజూ ఏదో ఓ మూల పాఠశాల వాహనాలు ప్రమాదాలకు గురౌతున్నాయి. వీటిపై వరుస కథనాలతో ‘సాక్షి’ హెచ్చరిస్తున్నా రవాణా శాఖలో ఏమాత్రం చలనం లేదు. ఫలితంగా జిల్లాలో ఈ రోజు ఓ చిన్నారి ప్రాణం బలైంది. రవాణా శాఖ అంతులేని నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. పక్క రాష్ట్రం తెలంగాణలో నిన్న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వార్త వింటూ ఉండగానే మన జిల్లాలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరగడం విచారకరం. ప్రతి స్కూల్ బస్సుకు ఒక అటెండర్ ఉండాలనే నిబంధనను యాజమాన్యాలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వరుస ప్రమాదాలు..
ఆగస్టు నెలలో వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 9న నందిగామలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు చందర్లపాడు మండలంలోని తొర్లపాడు వద్ద స్టీరింగ్ పని చేయక అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బస్సులో 18 మంది పిల్ల లు ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ప్రమాదస్థాయి తక్కువ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయికి చేయి విరగగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికి యాజమాన్యం నిర్వహణ లోపం వల్ల ప్రమాదం జరిగిందని రవాణా శాఖాధికారులు నిర్ధారించారు. నిన్న ఒక్క రోజే జగ్గయ్యపేట, విజయవాడ రూరల్ మండలంలో జరిగిన ఘటనలు ప్రమాదపు ఘంటికలను మోగిస్తున్నాయి. విజయవాడ రూరల్ ఎనికేపాడులో గురువారం జరిగిన ప్రమాదం కూడా అటువంటిదే. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను, ఆటోను ఢీకొని విధ్వంసం సృష్టించింది. నలుగురికి గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఇక్కడ కూడా అధికారుల నుంచి అదే సమాధానం వచ్చింది. బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంది కానీ నిర్వహణ లోపం వల్ల ప్రమాదం జరిగిందని. మరి వీటిని పట్టించుకోవాల్సింది ఎవరు., రవాణా అధికారుల పని కేవలం విద్యా సంవత్సరం అరంభంలో ఫిట్‌నెస్ టెస్ట్‌లని హడావిడి సృష్టించి తర్వాత మిన్నుకుండటమేనా. బస్సుల కండిషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యత వారిపై లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అంతులేని నిర్లక్ష్యం...
నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల తన బస్సుల వెహికల్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టును, డ్రైవర్ హెల్త్ కండిషన్‌ను పేరెంట్ మీటింగ్‌లో ఉంచాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో పేరెంట్ మీటింగ్ జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. రవాణా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలో చాలా బస్సులకు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు, రేడియం స్టిక్కర్లు లేవు, నిబంధనలకు మించి అధికంగా పిల్లలను తరలిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు లేవు. జరిమానాలు విధించిన దాఖలాలు అసలే లేవు. అంతులేని నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి విద్యా సంవత్సరం అరంభంలో ఏజెంట్ల ద్వారా వచ్చే బస్సులకు ఎటువంటి తనిఖీలు లేకుండా సర్టిఫికెట్ ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లీనర్లు బస్సులు నడుపుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి ఎన్నో తప్పిదాలు ఉన్నా పర్యవేక్షణ లోపంతో మరుగునపడుతున్నాయి.
నిబంధనలు..
మోటార్ వాహనాల చట్టం, 1969 రూల్ 185లో సవరణల తుది నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించి ఫిట్‌నెస్‌తో పాటు తీసుకోవాల్సిన 32 అంశాలపై జారీ చేసింది. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా నిబంధనలను ఉల్లఘించటమే అవుతుం ది. పాఠశాలలు తెరిచిన తర్వాత ఆకస్మిక తనిఖీ లతో ఎప్పటికప్పుడు చూడాల్సిన బాధ్యత రవా ణాశాఖకు ఉంది. అందులో నిన్న ప్రమాదం జరిగిన విధానం చూస్తే ఏఏ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందో తెలుసుకుందాం.
♦ పాఠశాల యాజమాన్యం విధిగా బస్సు డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ సొంత ఖర్చుతో డ్రైవర్‌కు ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
♦ ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన వారినే డ్రైవర్లుగా నియమించాలి. డ్రైవర్ నియామకం గురించి పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లాలి.
♦ బస్సుల పార్కింగ్ కోసం విద్యా సంస్థ పరిధిలోనే స్థలాన్ని కేటాయించాలి.
♦ పాఠశాల ఆవరణ నుంచే బస్సు ఎక్కటం, దిగటాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి.
♦ ప్రతి బస్సులోనూ అటెండర్ ఉండాలి.
♦ డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి.
♦ విద్యార్థులు బస్సు ఎక్కేటపుడు, దిగేటపుడు బస్సు అటెండర్ దగ్గరగా నిలబడి సురక్షితంగా ఎక్కి, దిగేలా చూడాలి
♦ ప్రతి ఏడాది ఒకసారి రవాణా శాఖ నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి డ్రైవర్‌ను పంపాలి.
పై నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారణ అవుతోంది. ఈ బస్సుకు అటెండర్ లేకపోవడం, పాఠశాలలో బస్సు పార్కింగ్ లేక బయట వేరే ప్రదేశంలో పార్క్ చేయడం కారణం. స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు అటెండర్ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. వీటికి తోడు డ్రైవర్ నిర్లక్ష్యం పిల్లాడి మరణానికి దారి తీసింది.
విచారణ జరుపుతున్నాం...
ప్రమాదం జరిగిన బస్సు కు ఫిటెనెస్ సర్టిఫికెట్ ఉంది. ప్రమాదం ఎం దుకు జరిగిందో విచారిస్తున్నాం. – ఈ. మీరా ప్రసాద్, డీటిసీ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment