యశ్వంత్(ఫైల్) ,రుతిక(ఫైల్)
మేడిపెల్లి(వేములవాడ): అప్పటివరకూ ఇంట్లో అల్లరి చేసిన చిన్నారులు విగతజీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిల్చిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మేడిపెల్లి మండలకేంద్రానికి చెందిన ఓల్పుల జలందర్–మానస దంపతులకు కొడుకు యశ్వంత్(5)తోపాటు కూతురు ఉంది. జలందర్ చెల్లెలు లావణ్యను పెగడపెల్లి మండలం ఆరేళ్లికి గ్రామానికి చెందిన దుబ్బెటి అజయ్‌కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి రుతిక(8)తోపాటు రెండేళ్ల కూతురు ఉంది.
రాఖీ పండుగకోసం మేడిపెల్లిలోని సోదరుడి ఇంటికి పిల్లలతోపాటు వచ్చింది. శుక్రవారం జలందర్ కొడుకు యశ్వంత్‌తోపాటు లావణ్య పిల్లలు రుతిక, చిన్నారి చెల్లెలు ఇంటి సమీపంలోని యాదవ సంఘంలో ఆడుకునేందుకు వెళ్లారు. సెప్టింక్‌ట్యాంకుకోసం తీసిన గుంతలో నీరు ఉండగా రుతిక, యశ్వంత్ అందులో పడిపోయారు. నీటిలో మునిగిపోతున్న వీరిని గమనించిన రుతిక చెల్లెలు ఇంట్లోకి వెళ్లి కేకలు వేస్తూ పెద్దలకు చెప్పడంతో గుంత వద్ద, సమీపంలోని బావి వద్ద వెతికారు. గుంతలో పడిపోయారని గుర్తించి బయటకు తీసి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అన్నాచెల్లెల్లకు చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో రెండుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. జలందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment