మృతిచెందిన నవజాత శిశువు
కర్నూలు, వెల్దుర్తి: సకాలంలో వైద్యం అందక శిశువు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. శిశువు తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్యాపిలి మండలం చండ్రపల్లికి చెందిన శివరామకృష్ణ, పుష్పావతి దంపతులకు ఒక కుమార్తె ఉంది. పుష్పావతి రెండవ కాన్పు కోసం వెల్దుర్తి మండలం నర్సాపురంలోని పుట్టింటికి వచ్చింది. సోమవారంపురిటినొప్పులు రావడంతో వెల్దుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో చేరింది. నర్సు, ఆయాల పర్యవేక్షణలో మంగళవారం అతికష్టం మీద కాన్పు కాగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. బిడ్డ ఏడవలేదు. అక్కడి వైద్యుల సూచన మేరకు వెంటనే డోన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక శిశువు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ వెల్దుర్తి ఆసుపత్రి కాంట్రాక్ట్ డాక్టర్ దీపిక నిర్లక్ష్యంతో పాటు, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా చేయడంతోనే తన బిడ్డ మృతిచెందినట్లు ఆరోపించాడు. 108 అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేయలేదని చెప్పాడు. కాగా.. ఇక్కడి ఆసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్, సరైన సౌకర్యాలు లేకపోవడం కారణంగా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే శిశువు మృతిచెందినట్లు డాక్టర్ తెలిపారు. బిడ్డ తండ్రి, బంధువుల అంగీకారంతోనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. కాగా.. వెల్దుర్తి ఆసుపత్రి సీహెచ్‌సీ అయినా, వైద్య విధాన పరిషత్‌లో ఉన్నా.. ఇక్కడ ఏళ్లుగా చిన్న పిల్లల డాక్టరు, అనస్తీషియన్ లేరు. వైద్య సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment