సాక్షి, సిటీబ్యూరో: గుంపుగా వచ్చిన కుక్కలు.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టాయి. జంతువులను వేటాడినట్టు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారి పరిస్థితి.. పులినోట చిక్కిన లేడిపిల్లలా తప్పించుకోలేని దైన్యం. ఏంచేయాలో తెలియని తనం. అరుపులే తప్ప ఆదుకునే వారు లేని దుస్థితి. ఒక కుక్క కాలు.. మరొకటి చేయిని నోట కరిచి లాగేశాయి. ఆ సమయంలో పసికందు వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. నిమిషాల వ్యవధిలో ఆ బాలుడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం నగరంలోని అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. అభం శుభం తెలియని పసిబాలుడిని పీక్కు తినడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నగరంలో ఎక్కడ చూసినా ఈ విషాదకర ఘటన గురించే చర్చిస్తూ కనిపించారు.
కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లు కూడా లేని బల్దియా తీరుపై మండిపడ్డారు. కుక్కలు మీదపడి రక్కుతున్న చిత్రాలను చూసి నెటిజెన్లు ఆగ్రహావేశాలతో పోస్టింగులు చేశారు. జంతు ప్రేమికులిప్పుడేం చేస్తారు.. ఏం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో చెప్పాలంటూ గొంతెత్తారు.
ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు..
వీధి కుక్కల స్వైర విహారం ఒక్క అంబర్‌పేటకే పరిమితం కాదు. నగరమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా.. అంబర్‌పేట సమీప ప్రాంతాల్లోనే ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సమీపంలోని మూసీ పక్కనే ఉన్న కుక్కల ఆపరేషన్ కేంద్రానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి శునకాలను తీసుకువస్తుంటారు. ఇక్కడికి నిత్యం 50కి పైగా కుక్కలు తీసుకు వచ్చి వాటికి ఆపరేషన్లు చేస్తుంటారు. అనంతరం వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయాల్సి ఉంటుంది.
కానీ.. అలా జరగడంలేదు. దీంతో వీధి శునకాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని దుర్గానగర్, గోల్నాక, ప్రేమ్‌నగర్, పటేల్‌నగర్, చే నంబరు చౌరస్తా, బతుకమ్మకుంట ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా నెలకొంది. వీటి భయంతో సాయంత్రం సమయాల్లో మహిళలు, చిన్నారులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.
బిస్కెట్ పాకెట్ అనుకుని..
ఆదివారం అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చేతిలో వాటర్ బాటిల్‌తో కనిపించడంతో.. కుక్కలు దానిని బిస్కెట్ ప్యాకెట్ అనుకుని అతని వెంటపడ్డాయి. దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడే ఉన్న తండ్రి గంగాధర్ ఇతర సిబ్బందితో సమీపంలోని
ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు బాలుడు అప్పటికే మృతి చెందాడు.
అయిదు నిమిషాలు దాడి చేశాయి
బాలుడు తండ్రితో పాటు కారు సరీ్వస్ సెంటర్‌కు వచ్చాడు. ప్రాంగణంలో ఆడుకుంటుండగా చూశా. ఒంటరిగా చేతిలో నీటి బాటిల్ పట్టుకుని బయటకు రావడంతో కుక్కలు వెంటబడి దాడి చేశాయి. పెద్దగా శబ్దం రాలేదు. అయినప్పటికీ వెంటనే తరిమేశాం. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
– నాగులు, కారు సర్వీస్ సెంటర్ సెక్యూరిటీ గార్డు
సుప్రీం ఆదేశాలు బేఖాతర్..
► ఆర్‌ఓసీ నెంబర్ 8938/2009 ఎం 3 ప్రకారం పట్టణాల్లో ఉన్న వీధి కుక్కలకు 90 రోజుల్లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని సుప్రీంకోర్టు దశాబ్దం క్రితం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు నగరంలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి.
► నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3500కు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు.
జంతు సంరక్షణ కేంద్రాలు సరే...
కుక్కలతో సహా జంతు సరంక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేకపోతోంది. గతంలో ‘కేటీఆర్ అంకుల్ మమ్మల్ని వీధికుక్కల బారినుంచి కాపాడండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. కుక్క కాట్లు..కన్నీటిచారికలు ఆరడం లేదు.
టీటీ, ఏఆర్‌వీ, రిగ్ వ్యాక్సిన్ తప్పనిసరి..
కుక్క కాటుకు టీటీతో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్(ఏఆర్‌వీ), రేబీస్ ఇమ్యునో గ్లోబులిన్ (రిగ్) వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈవీ నారాయణగూడ ఐపీఎం (కుక్కల దవాఖానా),
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని కుక్కలకు రేబీస్ ఇంజక్షన్‌లు వేయించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానులు వీటిని తప్పనిసరిగా తమ ఇళ్లలో పెంచుకునే కుక్కలకు వేయించాలన్నారు. వీధి కుక్కలకు జీహెచ్‌ఎంసీ నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి
ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
బాధితుల సంఖ్య పెరుగుతోంది
గత కొద్ది రోజులుగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్క కాటుకు గురైన బాధితులు వెంటనే ఫీవర్‌కు వచ్చి రిగ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కుక్క కరిసిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేబిస్ సోకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రేబిస్
చికిత్సకు మందులేదు. కుక్క కరిస్తే మొదటిరోజు ఒక డోస్ 7, 13, 28వ రోజు ఇంజక్షన్‌లు తప్పనిసరిగా వేయించుకోవాలి.
– డాక్టర్ కె.శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
నాగోలులో దాడి..
ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట డివిజన్ మారుతీనగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తపేట డివిజన్‌లో మారుతి నగర్ రోడ్ నెంబర్– 18లో వాచ్‌మన్‌గా పనిచేసే బాలు కుమారుడు నాలుగేళ్ల రిషి ఆడుకుంటుండగా కొన్ని శునకాలు వచ్చి బాలుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. గాయాల పాలైన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీధి కుక్కలు ఈ కాలనీలోకి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తూ దారి వెంట వెళ్లే వారిని వెంబడించి దాడికి పాల్పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కుక్కల భయంతో వణికిపోతున్నాం..
కుక్కల బెడద ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం బయటకు వెళ్లడానికి భయమేస్తోంది. సాయంత్రం వీధిలో పిల్లలు ఆడుకోవడానికి జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది.
– గిరిజ, బతుకమ్మకుంట
పిల్లలు వెళ్లే సమయంలో..
నర్సింహ బస్తీలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లో కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ వీధిలో ఓ కుక్క ఇప్పటికే పది మందికి పైగా దాడిచేసి గాయపరిచింది. అంబర్‌పేట ఘటనతో మా బస్తీలో కూడా కుక్కలు పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉంది.
– వేణు గౌడ్, నర్సింహ బస్తీ
ద్విచక్ర వాహనాలను వెంబడిస్తున్నాయి
తిలక్‌నగర్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. ద్విచక్ర వాహనాలపై వచీ్చపోయే వారిని వెంబడిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వెళ్లాలంటే
వృద్ధులు, చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు జీహెచ్‌ఎంసీ అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదు.
-రవి, తిలక్‌నగర్ బస్తీ
మేయర్ చెప్పినవన్నీ అబద్ధాలే
డెబ్బై అయిదు స్టెరిలైజేషన్ చేశామని నగర మేయర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఇంత పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేసినట్లయితే వీధి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగింది? 2021లో 4,60,000 ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 5 లక్షల 75 వేలకు ఎలా పెరిగింది?. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతను జీహెచ్‌ఎంసీ వదిలేసి, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం చాలా నష్టకరం. వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి.
– ఎం శ్రీనివాస్, సీపీఎం, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ
ఆ సమయంలో దాడి చేసే అవకాశాలు ఎక్కువ
ఫిబ్రవరి, సెపె్టంబర్ నెలలు కుక్కలకు బ్రీడింగ్ సీజన్ వంటివి. ఆయా నెలల్లో వీధి కుక్కలు మనుషుల్ని కరిచే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఆకలి బాధ కూడా ఒక ప్రధాన కారణమే. ఒక ప్రాంతంలోని శునకాలు మరో ప్రాంతంలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడి వెర్రెత్తి ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో అక్కడ కనిపించే వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సూపర్‌స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి, నారాయణగూడ
చదవండి: కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం.. చర్యలతో పునరావృతం కానివ్వం: మేయర్
Comments
Please login to add a commentAdd a comment