చిన్నారి కీర్తన మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు
కర్నూలు, కోవెలకుంట్ల: వచ్చీరాని మాటలతో, బుడిబుడి నడకలతో అందరినీ అలరించేది. తల్లిదండ్రులకు తలలో నాలుకలా మెలిగేది. అలాంటి ఆశా దీపాన్ని ఆర్టీసీ బస్సు చిదిమేసింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నె వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మూడున్నరేళ్ల చిన్నారి కీర్తన దుర్మరణం చెందింది. ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సౌదరదిన్నె గ్రామానికి చెందిన దస్తగిరి అలియాస్‌బాలరాజు, అనురాధ దంపతులకు కీర్తన, అమృత సంతానం. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. కోవెలకుంట్ల– బనగానపల్లె ఆర్‌అండ్‌బీ రహదారి పక్కనే ఉన్న సొంతింట్లో ఉంటూ దస్తగిరి ఆటో డ్రైవర్‌గానూ, అనురాధ కూలి పనులకు వెళుతూ జీవనంసాగిస్తున్నారు. కీర్తన గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తోంది. రోజులాగే ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. 11 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చింది.
ఆ సమయంలో ఇంటి వద్దనున్న చిన్నారి జేజి నాగేశ్వరమ్మ గ్యాస్ అయిపోవడంతో ఖాళీ సిలిండర్‌ను బయట ఉంచింది. గ్యాస్ సిలిండర్ల ఆటో బనగానపల్లె వైపు నుంచి వస్తుండటాన్ని గమనించిన ఆమె రోడ్డుపైకి చేరింది. చిన్నారి కీర్తన ఆమెను అనుసరించింది. గ్యాస్ సిలిండర్ల ఆటో ఇంటి సమీపంలో రోడ్డుకు అటువైపు ఆగింది. ఇదే సమయంలో వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ04 టీడబ్ల్యూ 2638 నంబర్ గల బస్సు కోవెలకుంట్ల నుంచి కర్నూలుకు వెళుతూ సౌదరదిన్నెకు చేరింది. బస్సు డ్రైవర్ చెన్నయ్య రోడ్డు పక్కన ఆగిఉన్న ఆటోను దృష్టిలో ఉంచుకుని బస్సును ఎడమ వైపు వేగంగా తీసుకెళ్లాడు. రోడ్డు పక్కనే ఉన్న చిన్నారి బస్సు కింద పడడంతో తల వెనుకవైపు నుజ్జు అయ్యి మెదడు బయటకు వచ్చింది. అక్కడికక్కడే మృతి చెందింది. గమనించని బస్సు డ్రైవర్ ఆపకుండా వేగంగా ముందుకెళ్లాడు. బస్సు కింద పడిన మనవరాలిని ఎత్తుకుని జేజి కేకలు వేస్తూ బస్సు వెనుక పరిగెత్తింది. రోడ్డుపక్కనే జొన్న పైరు కోస్తున్న కూలీలు గమనించి రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చి బస్సును ఆపారు. చిన్నారి మృతికి కారకుడైన డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మూడున్నరేళ్లకే చిన్నారికి నూరేళ్లు నిండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. కేసు నమోదు చేసి.. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment