
ఆదోని టౌన్: ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆదోని బస్టాండు నుంచి శనివారం ఉదయం 25 మందితో ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మేళిగనూరుకు బయలు దేరింది. కుప్పగల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. అప్రమత్తమైన కండక్టర్ లక్ష్మన్న.. డ్రైవర్ బసయ్య వైపు చూశారు. ఆయన డ్రైవింగ్ సీట్లోనే కుప్పకూలడం గమనించారు.
గట్టిగా కేకలు వేస్తూ డ్రైవర్‌ను అలర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ప్రయాణికులు కూడా డ్రైవర్ చెంతకు చేరుకుని కేకలు వేశారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపాడు. బస్సు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. కండక్టర్ వెంటనే 108కు సమాచారమిచ్చి డ్రైవర్‌ను ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.