శ్రీరాములు, అరుణకుమార్‌ల మృతదేహాలు
అప్పటిదాకా బడిలో పాఠాలు నేర్చుకున్న ఇద్దరు చిన్నారులు తరగతులు ముగిశాక సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. వాగు గోతుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లలో ఈత కొట్టాలని సరదా పడ్డారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మిత్రులిద్దరూ ప్రాణాలు విడిచారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన ముండ్లమూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నింపింది.
ముండ్లమూరు: ముండ్లమూరు ఎస్సీ కాలనీకి చెందిన గోపనబోయిన చిన్నా, అంజమ్మలకు ఒక్కగానొక్క సంతానం శ్రీరాములు (శ్రీరామ్). అదే ప్రాంతానికి చెందిన పిల్లి బాలస్వామి, అంజలి దంపతుల మూడోసంతానం అరుణ కుమార్ ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శ్రీరాములు (10) 5వ తరగతి, అరుణకుమార్ (9) 4వ తరగతి చదువుతున్నారు. చిన్నారులిద్దరూ రోజూ లానే గురువారం బడికి వెళ్లారు. సాయంత్రం బడి విడిచి పెట్టాక కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామానికి శివారున ఉన్న చిలకలేరు వద్దకు వెళ్లారు. వాగులోని ఓగోతిలో కొద్దిగా నీరుండటంతో బట్టలు విప్పి ఒడ్డున పెట్టి ఈతకు దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో ఊపిరాడక మృతి చెందారు. చీకటి పడినా చిన్నారులు ఇద్దరు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకడం మొదలు పెట్టారు.
స్నేహితులను వాకబు చేశారు. చిలకలేరు వైపు వెళ్లినట్లు రాత్రి 7 గంటల సమయంలో విద్యార్థులు తెలిపారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు చిలకలేరులో వెదకడం మొదలు పెట్టారు. వాగు సమీపంలో దుస్తులు, చెప్పులు కనిపించడంతో నీటిలోకి దిగి చూశారు. చిన్నారుల ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శివనాంచారయ్య చిలకలేరుకు చేరుకొని మృతదేహాలను కుటుంబ సభ్యుల సాయంతో ఇంటికి చేర్చారు. ఈ ఘటనతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక్కడే కుమారుడు కావడంతో శ్రీరామ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment