భైంసా, న్యూస్‌లైన్ : ఆదివారం ఆటవిడుపు ఓ బాలుడి ప్రాణం తీసింది. సరదాగా టైర్ ఆడుతూ రోడ్డు పక్కగా వెళ్తున్న ఆ చిన్నారిని కారు రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. ఆడుకునేందుకు బయటికెళ్లిన తమ కొడుకు విగతజీవుడిగా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
స్థానికులు, భైంసా రూరల్ ఎస్సై గుణంత్‌రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మి-వెంకటి దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కుమారుడు. స్థానికంగా వ్యవసాయ కూలీ పనులు చేస్తూ, బండరాళ్లు కొడుతూ పిల్లలను చదివిస్తున్నారు. ఆదివారం రోజు ఎప్పటిలాగే ఇంట్లో నుంచి పాత టైరును తీసుకుని వీరి కొడుకు రవి(8) రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో భైంసా నుంచి ముథోల్ వెళ్తున్న నానోకారు బాలుడిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో బాలుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పక్కనే సాయిబాబా ఆలయం వద్ద ఉన్న భక్తులంతా హుటా హుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు.