రాంగోపాలపురం పంచాయతీలోని సున్నంగుంపు గ్రామంలో సోమవారం నెలన్నర వయస్సున్న బాలుడు మృతిచెందాడు.
రాంగోపాలపురం (భద్రాచలం రూరల్), న్యూస్‌లైన్: రాంగోపాలపురం పంచాయతీలోని సున్నంగుంపు గ్రామంలో సోమవారం నెలన్నర వయస్సున్న బాలుడు మృతిచెందాడు. పోలియో చుక్కల మందు వికటించినందునే తమ బిడ్డ చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ బాలుడి మృతికి కిడ్నీ సంబంధ వ్యాధే కారణమని పరిశీలనలో తేలిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రకాశ్ చెబుతున్నారు. బాలుడి మృతికి సంబంధించి తల్లి రాధ తెలిపిన ప్రకారం..
సున్నం రమేష్-రాధ దంపతుల నెలన్నర వయసున్న కుమారుడికి శనివారం రాత్రి వాంతులు చేసుకున్నాడు. జలుబుతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆదివారం ఉదయం పోలి యో చుక్కల కేంద్రానికి తీసుకెళ్లారు. బాలుడి అనారోగ్య విషయాన్ని వారు అక్కడి సిబ్బందికి చెప్పలేదు. చుక్కలు వేసిన తరువాత కొద్దిపసేపటికి ఆ చిన్నారికి మళ్లీ వాంతులయ్యాయి. తల్లిదండ్రులు ఆ పిల్లాడిని ముందుగా ఓ గిరిజన పూజారి వద్దకు తీసుకెళ్లారు. ఆ పూజారి రోగ నివారణ పేరుతో మూడు గంటలపాటు పూజలు నిర్వహించి, డాక్టర్ వద్దకు వెళ్లాలని సూచించాడు. ఆ తల్లిదండ్రులు భద్రాచలంలోని ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని చెప్పారు. ఆ తల్లిదండ్రులు ఖమ్మం ఆస్పత్రికి కాకుండా స్థానికంగాగల మరో ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ బాలుడు అక్కడే సోమవారం ఉదయం మృతిచెందాడు. పోలియో చుక్కలు వికటించినందునే తమ కుమారుడు మృతిచెందాడని సున్నం రమేష్-రాధ దంపతులు ఆరోపిస్తున్నారు.
పోలియో చుక్కలు కారణం కాదు...
చిన్నారి మృతి విషయం తెలుసుకున్న సంబంధిత (లక్ష్మీపురం) పీహెచ్‌సీ వైద్యుడు సత్యదేవ్.. సున్నం గుంపు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. పోలి యో చుక్కలు వేయించక ముందు నుంచే బాలుడు అనారోగ్యంతో ఉన్నాడని, సకాలంలో వైద్యం అం దని కారణంగానే మృతిచెందాడని నిర్థారించారు.
కిడ్నీ సంబంధ వ్యాధే కారణం..
చిన్నారి మృతికి పోలియో చుక్కలు కారణం కానేకాదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్ చెప్పారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. కిడ్నీ సంబంధ వ్యాధి కారణంగానే ఆ చిన్నారి మృతిచెందినట్టుగా తమ విచారణలో తేలినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేస్తే మృతిచెందటం జరగదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్భయంగా పోలియో చుక్కలు వేయించవచ్చని అన్నారు.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలియో చుక్కలు వేయించవచ్చు..
ఖమ్మం మయూరి సెంటర్: ఐదేళ్ల లోపు పిల్లలు ఎంతటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నిస్సందేహంగా పోలియో చుక్కలు వేయించవచ్చని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు చెప్పారు. ఆయన సోమవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. భద్రాచలంలో మండలంలో ఓ చిన్నారి మృతికి పోలియో చుక్కలు ఏమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. ఈ చిన్నారికి వేసిన వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్ మందునే మరో లక్షమంది చిన్నారులకు కూడా వేశామన్నారు.
అమాయకత్వం,
అవగాహన లోపమే కారణం
గిరిజన చిన్నారి మృతికి తల్లిదండ్రుల అమాయకత్వం, అవగాహన లోపమే అసలు కారణమని అర్థమవుతోంది. బాలుడి అనారోగ్య విషయాన్ని తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేసిన సిబ్బందికి ముందుగా చెప్పలేదు. చెప్పి ఉన్నట్టయితే వారు తగిన సలహా, సూచనలు ఇచ్చేవారేమో..! ఆ తరువాత కూడా.. వాంతులతో అస్వస్థుడైన చిన్నారిని వెంటనే ఆస్పత్రికి కాకుండా గిరిజన పూజారి వద్దకు తీసుకెళ్లి, దాదాపు మూడు గంటలపాటు అక్కడే గడిపారు. ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని భద్రాచలంలోని ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు చెప్పినప్పటికీ వినకుండా, స్థానికంగాగల మరో ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటి రోజు ఉదయం అక్కడే బాలుడు మృతిచెందాడు. బాలుడిని ముందుగా గిరిజన పూజారి వద్దకు తీసుకెళ్లడం.. ఆ తల్లిదండ్రుల అమాయకత్వానికి, ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ వినకపోవడం... (వైద్యం-ఆరోగ్యంపై) వారి అవగాహన లేమికి అద్దం పడుతోంది. ఏజెన్సీలోని గిరిజనులకు ‘ఆరోగ్యం, వైద్యం’పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఈ బాలుడి మృతి ఉదంతం మరోమారు గుర్తుచేసినట్టయింది.