ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్
హైదరాబాద్: ఆ చిన్నారి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు..కలలు..బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తుందనుకున్నాడు. కానీ, విధి కర్కశమైంది. వాటర్‌ట్యాంకర్ రూపంలో అకాల మృత్యువు ఆ చిట్టితల్లిని కబళించేసింది. ఆ కూతురిపై పెట్టుకున్న ఆశల్ని చిదిమేసింది. కళ్లముందే కన్న కూతురు ఆ ట్యాంకర్ చక్రాల కింద నలిగిపోతుంటే ఆ తండ్రి పడ్డ క్షోభ వర్ణనాతీతం. కూతురిని బడికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడంతో చిన్నారి విద్యార్థిని మృతి చెందింది. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలో నివాసముండే నరేశ్‌కుమార్ జైన్‌కు కూతురు దియాజైన్(8),కుమారుడు(3) ఇద్దరు సంతానం. దియాజైన్ గన్‌ఫౌండ్రీలోని రోజరీ కాన్వెంట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది.
రోజూ కూతురుని నరేశ్‌కుమార్ జైన్ పాఠశాలలో వదిలి వెళ్తుంటాడు. నరేశ్‌కుమార్ జైన్ ఎప్పటిలాగే కూతురిని పాఠశాలలో దింపే క్రమంలో ఇంటినుంచి బడికి బయల్దేరారు. నాంపల్లి నుంచి చాపల్‌రోడ్డు గుండా వెళ్లే క్రమంలో మెథడిస్ట్ చర్చి వద్దకు రాగానే తన ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో తండ్రి, కూతురు కిందపడిపోయారు. అయితే వీరి వెనుకనే వస్తోన్న వాటర్ ట్యాంకర్ వెనుక చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. నరేశ్ కుమార్ జైన్‌కు కాలి తొడలు, కడుపు భాగాల్లో తీవ్ర∙గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయాలతో ఉన్న నరేశ్ కుమార్ జైన్‌ను చికిత్స నిమిత్తం కింగ్‌కోఠిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన దియాజైన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసును ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మయ్య దర్యాప్తు చేస్తున్నారు.
తల్లడిల్లిన కుటుంబసభ్యులు, విద్యార్థులు
చిన్నారి దియాజైన్ మృతిచెందిన వార్త తెలియగానే బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పటివరకు తమ కళ్లముందే తిరిగిన చిన్నారి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నిన్నటివరకు సరదాగా పాఠశాలకు వచ్చి తమతో ఆడిపాడిన విద్యార్థిని మృతిచెందిన విషయం తెలియడంతో దియాజైన్ తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment