కంభాలపాడు (పొదిలి), న్యూస్‌లైన్ : భార్యతో విభేదాల కారణంగా కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులను బావిలోపడేసి చంపేసిన సంఘటనతో మండలంలోని కంభంపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరగ్గా, బుధవారం ఉదయం బావిలో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. నిందితుడు కోటిరెడ్డి గ్రామం సమీపంలోని అటవీభూముల అవతలివైపు ఉన్న బావిలో తన ఇద్దరు బాలురైన రామాంజనేయులరెడ్డి (7), తిరుపతిరెడ్డి (6)లను పడేశాడు. అప్పటికే రాత్రి కావడంతో బుధవారం ఉదయం దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సీఐ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీయించడంతో తల్లి సుజాత, ఇతర బంధువులు తట్టుకోలేక భోరున విలపించారు. వారితో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు.
నిందితుడు కోటిరెడ్డి చూపించిన దారి ప్రకారం...చెట్లు, పుట్టలు దాటుకుంటూ అష్టకష్టాలుపడి బావివద్దకు చేరుకున్నారు. అక్కడ బావిలోకి దిగేందుకు వీలుగా చెట్లు తొలగించి ఎంతో కష్టపడి మృతదేహాలను బయటకు తీసి గ్రామంలోని ఇంటివద్దకు తరలించారు. బావివద్దే శవపంచనామాతో పాటు పోస్టుమార్టం కూడా చేయించిన పోలీసులు.. మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తల్లి, బంధువుల రోదనలతో గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు. ముందుగా డీఎస్పీ, సీఐలు గ్రామంలోని ఇంటివద్ద బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు సీఐ తెలిపారు. స్థానిక సర్పంచ్ పి.శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఆవులూరి కోటేశ్వరరావు, పెద్దలు అంబటి సీతారామిరెడ్డి, కోవెలకుంట్ల నరసింహారావు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత తల్లిని ఓదార్చారు.
దేవుడిదగ్గరకని చెప్పి...
రోజూ తమను పట్టించుకోని నాన్న.. సైకిల్‌పై వచ్చి దేవుడిదగ్గరకని చెప్పి తీసుకెళ్తుండటంతో ఆ చిన్నారులు ఆనందపడ్డారు. నాన్నా.. దేవుడెక్కడున్నాడు..ఇంకెంత దూరం వెళ్లాలి... అంటూ మధ్యమధ్యలో అడుగుతూ ఉన్నారు. మధ్యలో బడ్డీబంకు వద్ద సైకిల్ ఆపి పిల్లలకు తినుబండారాలు కొనిపించిన ఆ తండ్రి.. నిజంగానే మధ్యలో కొండపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి గుడికి తీసుకెళ్లి పిల్లలకు దేవుడిని చూపించాడు. ఆ తర్వాత కాసేపటికి నిజంగానే దేవుడిదగ్గరకు పంపించాడు. కన్నబిడ్డలను ఎంతో కఠినంగా బావిలో పడేసి చంపేశాడు. ముందుగా పెద్ద కుమారుడిని, ఆ వెంటనే రెండో కుమారుడిని బావిలో వేసి చనిపోయిందాకా అక్కడే ఉండి ఆ తర్వాత గ్రామానికి వచ్చాడు. భార్యమీద కోపంతో పిల్లలను చంపేసి మానవత్వాన్ని మంటకలిపాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతను ఈ విషయాన్ని వెల్లడించాడు.
గొల్లుమన్న కంభంపాడు
Published Thu, Dec 12 2013 5:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement