kambhampadu
-
కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట..
సాక్షి, మాచర్ల రూరల్: కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట.. కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న కేతావత్ శివా నాయక్ (22)కు, రెంటచింతల మండలం పశర్లపాడుకు చెందిన జఠావత్ అనితతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మాచర్ల పట్టణంలోని ఓ కళాశాలలో అనిత డిగ్రీ చదువుతోంది. వేసవి సెలవుల్లో వివాహం జరిపించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అనిత కుటుంబంలో ఏర్పడ్డ స్వల్ప విభేదాలతో కలత చెందిన శివానాయక్, అనితలు గురువారం కంభంపాడు కుడికాలువలో దూకారు. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడికి చేరుకుని కాలువలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ రక్షించేందుకు అక్కడే ఉన్న కొంతమందిని పురమాయించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శివా నాయక్ కొట్టుకుపోగా.. కొన ఊపిరితో ఉన్న అనితను ఒడ్డుకు చేర్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివా నాయక్ మృతదేహాన్ని కాలువలో గాలించి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన తమ పిల్లలకు ఈ దుస్థితేంటంటూ ఇరు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గొల్లుమన్న కంభంపాడు
కంభాలపాడు (పొదిలి), న్యూస్‌లైన్ : భార్యతో విభేదాల కారణంగా కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులను బావిలోపడేసి చంపేసిన సంఘటనతో మండలంలోని కంభంపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరగ్గా, బుధవారం ఉదయం బావిలో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. నిందితుడు కోటిరెడ్డి గ్రామం సమీపంలోని అటవీభూముల అవతలివైపు ఉన్న బావిలో తన ఇద్దరు బాలురైన రామాంజనేయులరెడ్డి (7), తిరుపతిరెడ్డి (6)లను పడేశాడు. అప్పటికే రాత్రి కావడంతో బుధవారం ఉదయం దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సీఐ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీయించడంతో తల్లి సుజాత, ఇతర బంధువులు తట్టుకోలేక భోరున విలపించారు. వారితో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. నిందితుడు కోటిరెడ్డి చూపించిన దారి ప్రకారం...చెట్లు, పుట్టలు దాటుకుంటూ అష్టకష్టాలుపడి బావివద్దకు చేరుకున్నారు. అక్కడ బావిలోకి దిగేందుకు వీలుగా చెట్లు తొలగించి ఎంతో కష్టపడి మృతదేహాలను బయటకు తీసి గ్రామంలోని ఇంటివద్దకు తరలించారు. బావివద్దే శవపంచనామాతో పాటు పోస్టుమార్టం కూడా చేయించిన పోలీసులు.. మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తల్లి, బంధువుల రోదనలతో గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు. ముందుగా డీఎస్పీ, సీఐలు గ్రామంలోని ఇంటివద్ద బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు సీఐ తెలిపారు. స్థానిక సర్పంచ్ పి.శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఆవులూరి కోటేశ్వరరావు, పెద్దలు అంబటి సీతారామిరెడ్డి, కోవెలకుంట్ల నరసింహారావు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత తల్లిని ఓదార్చారు. దేవుడిదగ్గరకని చెప్పి... రోజూ తమను పట్టించుకోని నాన్న.. సైకిల్‌పై వచ్చి దేవుడిదగ్గరకని చెప్పి తీసుకెళ్తుండటంతో ఆ చిన్నారులు ఆనందపడ్డారు. నాన్నా.. దేవుడెక్కడున్నాడు..ఇంకెంత దూరం వెళ్లాలి... అంటూ మధ్యమధ్యలో అడుగుతూ ఉన్నారు. మధ్యలో బడ్డీబంకు వద్ద సైకిల్ ఆపి పిల్లలకు తినుబండారాలు కొనిపించిన ఆ తండ్రి.. నిజంగానే మధ్యలో కొండపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి గుడికి తీసుకెళ్లి పిల్లలకు దేవుడిని చూపించాడు. ఆ తర్వాత కాసేపటికి నిజంగానే దేవుడిదగ్గరకు పంపించాడు. కన్నబిడ్డలను ఎంతో కఠినంగా బావిలో పడేసి చంపేశాడు. ముందుగా పెద్ద కుమారుడిని, ఆ వెంటనే రెండో కుమారుడిని బావిలో వేసి చనిపోయిందాకా అక్కడే ఉండి ఆ తర్వాత గ్రామానికి వచ్చాడు. భార్యమీద కోపంతో పిల్లలను చంపేసి మానవత్వాన్ని మంటకలిపాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. -
మీ కంటే పెద్ద రౌడీని : చంద్రబాబు
కంభంపాడు : ఆత్మగౌరవ యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురువుతున్నాయి. కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామస్తులు సోమవారం రాత్రి బాబు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరోపణలు మాని అసలు రాష్ట్ర విభజనపై వైఖరి ఏంటో స్పష్టం చేయాలని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు...గ్రామస్తులపై కన్నెర్రజేశారు. రౌడీలు, గుండాల్లా వ్యవహరిస్తున్నారని వారిని దుర్భాషలాడారు. మీ కంటే పెద్ద రౌడీని.... తోకలు కత్తిరిస్తానంటూ కంభంపాడు వాసుల్ని హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది గ్రామస్తుల్ని దూరం తీసుకెళ్లారు. అయితే చంద్రబాబును నిలదీసిన గ్రామస్తులపై స్థానిక టీడీపీ నేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బాబు ఆదేశాలతోనే తమపై కేసు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.