సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన.
ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు
Comments
Please login to add a commentAdd a comment