vitthal
-
వికారాబాద్: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్!
సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు -
ఏకాదశి ఉత్సవాల్లో సీఎం దంపతులు
ముంబైః ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు మహరాష్ట్రలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్పవాల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అయన భార్య అమృతా లు పండరపుర విఠల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా పూజకు భక్తులు లక్షల్లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతాలు పండరపుర విఠల్ దేవాలయాన్ని దర్శించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాల్లో తెల్లవారుజామున మహాపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులు విఠలేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో కొలువైన పండరపుర విఠలుని ఏకాదశి దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూ కట్టారు. ఆ విఠలేశ్వరుడు భక్తులందరినీ చల్లగా కాపాడాలని, ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరపుర ఆలయంలో నిర్వహించే 'వారి' ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏకాదశి సందర్భంగా ముంబై 'వడాలా' లోని విఠల్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించేందుకు వేలల్లో భక్తులు తరలివస్తారన్నఉద్దేశ్యంతో ముందుగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్ళించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
హోరు.. పోరు..
కంటోన్మెంట్: కంటోన్మెంట్ కదనరంగం వేడెక్కింది. ఈనెల 11న జరగనున్న బోర్డు ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ర్యాలీలు, పాదయాత్రలు, ధూంధాంలతో ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ఏకంగా వార్డుకో మంత్రిని నియమించి గెలుపు బాధ్యతలను అప్పగించడంతో సగం కేబినేట్ ఇక్కడే తిష్టవేసింది. విపక్షాల నుంచి రాజకీయ ఉద్ధండుల వారసులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలే అయినా, ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తమ ప్యానల్ అభ్యర్థుల విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు సైతం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న 2, 3, 5వ వార్డుల్లోనూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున సగం మంది మంత్రులు, డిప్యూటీ స్పీకర్, విప్‌లు, 20 మంది ఎమ్మెల్యేలు కంటోన్మెంట్లో మోహరించారు. మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వారం రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మం త్రులు టి.హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు రెండు రోజులుగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, విప్ ఓదేలు, 20 మందికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కంటోన్మెంట్లో ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. పార్టీ బలహీనంగా ఉన్న వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్కు అన్ని వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులే ఉన్నా నాలుగు వార్డుల్లో రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఎంపీ, ఎమ్మెల్యేలకు సవాలే.. తెలుగు దేశం పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలకు బోర్డు ఎన్నికలు సవాల్‌గా మారాయి. నాలుగోవార్డు నుంచి స్వయంగా తన కూతురు లాస్య నందితను రంగంలోకి దింపిన సాయన్న ఆమె గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక సమయాన్ని ఆ వార్డుకే కేటాయిస్తున్నారు. ఎంపీ మల్లారెడ్డి 1, 6వ వార్డుల్లో గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్తీకి ఓ కీలక నేతను ఇన్చార్జిలుగా నియమించారు. ఒకటోవార్డులో రఘువీర్ సింగ్, ఆరోవార్డులో బాణాల శ్రీనివాస్‌రెడ్డి గెలుపును ఆయన అత్యంత కీలకంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆపసోపాలు.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన కూతురు సుహాసిని (రెండోవార్డు), కుమారుడు (నవనీత్)లను ఎన్నికల బరిలో నిలిపారు. ఇక ఏడో వార్డులో పి.భాగ్యశ్రీ, ఎనిమిదో వార్డులో ఖదీరవన్ మాత్రమే బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నాలుగోవార్డులో బోర్డు బరిలో నాలుగు సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన డీబీ దేవేందర్ ఈ సారి తన కూతురు అంబికను పోటీలో నిలిపారు. సానుభూతి ఓట్లపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ వార్డులో కాంగ్రెస్‌కే చెందిన మరో నేత వెంకటేశ్ భార్య సుశీల కూడా ప్రధాన పోటీదారుల్లో ఒకరు కావడం గమనార్హం. ఐదో వార్డులో వార్డులో సర్వే కుమారుడు నవనీత్తోపాటు వార్డు అధ్యక్షుడు సంకి రవీందర్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అల్లుడు రాజేశ్‌లు సైతం పార్టీ అభ్యర్థులుగానే బరిలో ఉన్నారు. ఇక ఒకటి, మూడు, ఆరోవార్డులోని పార్టీ అభ్యర్థుల పోటీ నామమాత్రంగానే ఉంది. ఎవరినీ ఉపేక్షించం అనుమతి లేకుండా ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొంటే కేబినెట్ మంత్రులనైనా ఉపేక్షించేది లేదు. బోర్డు ఎన్నికల్లో మోడల్ కోడ్ ఉల్లంఘనలను సీరియస్‌గా పరిగణిస్తాం. ఇటీవల గాయత్రి గార్డెన్స్, జీవీఆర్ గార్డెన్స్‌లో కొందరు మంత్రుల ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినట్టు మా దృష్టికొచ్చింది. వీటిపై పోలీసు అనుమతుల వివరాలు, తమ సిబ్బంది వీడియో రికార్డుల ఆధారంగా సోమవారం సభ నిర్వాహకులకు నోటీసులు పంపిస్తాం. ఇప్పటివరకు 87 మందికి ఉల్లంఘన నోటీసులు పంపాం. అనుమతి లేకుండా ఫంక్షన్ హాళ్లలో ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా ఉండేలా చూడాల్సిందిగా హోంమంత్రి, సీఎస్, డీజీపీలకు ప్రత్యేకంగా లేఖలు పంపుతున్నాం. - విఠల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన విఠల్ (48) హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన విధులు నిర్వహించడానికి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంది సమీపంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో విఠల్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డీఎస్పీ వెంకటేశ్, రూరల్ సీఐ రఘు, ఎస్ఐ రాజశేఖర్, ఇంద్రకరణ్ ఎస్ఐ లాలూనాయక్లు అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విఠల్‌కు భార్య భూదేవి, కూతుళ్లు శ్రవంతి, శ్రావణి, సాయిభవాని, కొడుకు సాయి కార్తీక్ ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. విఠల్ భార్య భూదేవి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల సంతాపం హెడ్‌కానిస్టేబుల్ విఠల్ మృతి పట్ల ఇంద్రకరణ్ ఎస్ఐ లాలూనాయక్తోపాటు సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఠల్ అంకితభావంతో పనిచేసేవారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.