హోరు.. పోరు.. | Cantonment Board elections | Sakshi
Sakshi News home page

హోరు.. పోరు..

Published Mon, Jan 5 2015 2:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

హోరు.. పోరు.. - Sakshi

హోరు.. పోరు..

 కంటోన్మెంట్: కంటోన్మెంట్ కదనరంగం వేడెక్కింది. ఈనెల 11న జరగనున్న బోర్డు ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ర్యాలీలు, పాదయాత్రలు, ధూంధాంలతో ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ఏకంగా వార్డుకో మంత్రిని నియమించి గెలుపు బాధ్యతలను అప్పగించడంతో సగం కేబినేట్ ఇక్కడే తిష్టవేసింది. విపక్షాల నుంచి రాజకీయ ఉద్ధండుల వారసులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలే అయినా, ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తమ ప్యానల్ అభ్యర్థుల విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు సైతం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న 2, 3, 5వ వార్డుల్లోనూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్‌ఎస్ తరఫున సగం మంది మంత్రులు, డిప్యూటీ స్పీకర్, విప్‌లు, 20 మంది ఎమ్మెల్యేలు కంటోన్మెంట్‌లో మోహరించారు.

మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వారం రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మం త్రులు టి.హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు రెండు రోజులుగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, విప్ ఓదేలు, 20 మందికిపైగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సైతం కంటోన్మెంట్‌లో ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. పార్టీ బలహీనంగా ఉన్న వార్డుల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌కు అన్ని వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులే ఉన్నా నాలుగు వార్డుల్లో రెబెల్స్ బెడద తప్పేలా లేదు.
 
ఎంపీ, ఎమ్మెల్యేలకు సవాలే..
తెలుగు దేశం పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలకు బోర్డు ఎన్నికలు సవాల్‌గా మారాయి. నాలుగోవార్డు నుంచి స్వయంగా తన కూతురు లాస్య నందితను రంగంలోకి దింపిన సాయన్న ఆమె గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక సమయాన్ని ఆ వార్డుకే కేటాయిస్తున్నారు. ఎంపీ మల్లారెడ్డి 1, 6వ వార్డుల్లో గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్తీకి ఓ కీలక నేతను ఇన్‌చార్జిలుగా నియమించారు. ఒకటోవార్డులో రఘువీర్ సింగ్, ఆరోవార్డులో బాణాల శ్రీనివాస్‌రెడ్డి గెలుపును ఆయన అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
 
కాంగ్రెస్ ఆపసోపాలు..
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన కూతురు సుహాసిని (రెండోవార్డు), కుమారుడు (నవనీత్)లను ఎన్నికల బరిలో నిలిపారు. ఇక ఏడో వార్డులో పి.భాగ్యశ్రీ, ఎనిమిదో వార్డులో ఖదీరవన్ మాత్రమే బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నాలుగోవార్డులో బోర్డు బరిలో నాలుగు సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన డీబీ దేవేందర్ ఈ సారి తన కూతురు అంబికను పోటీలో నిలిపారు.

సానుభూతి ఓట్లపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ వార్డులో కాంగ్రెస్‌కే చెందిన మరో నేత వెంకటేశ్ భార్య సుశీల కూడా ప్రధాన పోటీదారుల్లో ఒకరు కావడం గమనార్హం. ఐదో వార్డులో వార్డులో సర్వే కుమారుడు నవనీత్‌తోపాటు వార్డు అధ్యక్షుడు సంకి రవీందర్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అల్లుడు రాజేశ్‌లు సైతం పార్టీ అభ్యర్థులుగానే బరిలో ఉన్నారు. ఇక ఒకటి, మూడు, ఆరోవార్డులోని పార్టీ అభ్యర్థుల పోటీ నామమాత్రంగానే ఉంది.
 
ఎవరినీ ఉపేక్షించం
అనుమతి లేకుండా ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొంటే కేబినెట్ మంత్రులనైనా ఉపేక్షించేది లేదు. బోర్డు ఎన్నికల్లో మోడల్ కోడ్ ఉల్లంఘనలను సీరియస్‌గా పరిగణిస్తాం. ఇటీవల గాయత్రి గార్డెన్స్, జీవీఆర్ గార్డెన్స్‌లో కొందరు మంత్రుల ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినట్టు మా దృష్టికొచ్చింది. వీటిపై పోలీసు అనుమతుల వివరాలు, తమ సిబ్బంది వీడియో రికార్డుల ఆధారంగా సోమవారం సభ నిర్వాహకులకు నోటీసులు పంపిస్తాం.

ఇప్పటివరకు 87 మందికి ఉల్లంఘన నోటీసులు పంపాం. అనుమతి లేకుండా ఫంక్షన్ హాళ్లలో ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా ఉండేలా చూడాల్సిందిగా హోంమంత్రి, సీఎస్, డీజీపీలకు ప్రత్యేకంగా లేఖలు పంపుతున్నాం. - విఠల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement