Cantonment Board elections
-
కంటోన్మెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 17న కేంద్రం ఎన్నికల తేదీ ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బోర్డు అధికారులు ప్రత్యేక బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ఖరారు చేశారు. కేంద్రం ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తదనుగుణంగా ఓటరు జాబితా ప్రకటన, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం, నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, గుర్తుల కేటాయింపు తదితర తేదీలను బోర్డు అధికారులు ప్రకటించారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు. పార్టీల ప్రమేయం లేదు.. ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండానే ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందిస్తారు. ►ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్–2007కు అనుగుణంగా రూపొందించిన ఓటరు జాబితాలో ఫొటోలు ఉండవు, కేవలం ఓటర్ల పేరు, చిరునామా మాత్రమే ఉంటాయి. ►అయితే ఎన్నికల సంఘం గుర్తించిన ప్రామాణిక గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి ఉంటేనే ఓటింగ్‌కు అనుమతిస్తారు. ►రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా నిర్వహించే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, బోర్డు అధికారులు సూచించిన 70 గుర్తుల జాబితా నుంచి గుర్తు కేటాయిస్తారు. వార్డుల రిజర్వేషన్లు ఇలా.. ది కంటోన్మెంట్స్ యాక్ట్ 2006 అమల్లోకి వచ్చాక, ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ –2007 ఆధారంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను 2008లోనే ఎనిమిది వార్డులగా విభజించారు. ►2008 ఎన్నికల్లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పట్లో 1, 5, 6 వార్డులు మహిళలకు, 8 వార్డు ఎస్సీ జనరల్ కేటగిరీగా రిజర్వేషన్లు అమలు చేశారు. ►మళ్లీ 2015లో జరిగిన ఎన్నికల్లో 1,5, 6 వార్డులను జనరల్‌గా మార్చి మిగిలిన నాలుగు జనరల్ వార్డుల్లో మూడింటిని లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించారు. దీంతో 3,4,7 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ►తాజా ఎన్నికల కోసం 2019లోనే మళ్లీ రొటేషన్ పద్ధతిలో మిగిలిన నాలుగు జనరల్ వార్డుల్లో మూడింటి కోసం లాటరీ తీయగా 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ►2011 జనాభా లెక్కల ప్రకారం వరుసగా మూడో సారి ఎనిమిదో వార్డు ఎస్సీలకు రిజర్వ్ అవుతూ వస్తోంది. 1,32,722 మంది ఓటర్లు గతేడాది సెప్టెంబర్ 15న ప్రకటించిన జాబితా ప్రకారం ఎనిమిది వార్డులకు గానూ మొత్తం 2,32,722 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇదే జాబితాలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. 2015 ఎన్నికలతో పోలిస్తే (1,63,630 ) 30,908 మంది ఓటర్లు తగ్గారు. 2015 ఎన్నికల తర్వాత ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఓటు హక్కు కల్పించ వద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు విడతల్లో సుమారు 45 వేల ఓట్లు తొలగించారు. కొత్త ఓటర్లు నమోదుతో కలపడం ద్వారా తాజా ఓటర్లు సంఖ్య 1.32,722కు చేరింది. 2015లో 23,667 ఓట్లతో ఆరోవార్డు అతిపెద్దదిగా ఉండగా, ప్రస్తుతం 22,919 మంది ఓటర్లతో ఐదో వార్డు అతిపెద్దదిగా కొనసాగుతోంది. 2018 నాటికి 32,705 మంది ఓటర్లతో కొనసాగిన రెండో వార్డులో భారీగా ఓట్ల తొలగింపు చేపట్టడంతో ప్రస్తుతం కేవలం 7,872 మంది మాత్రమే మిగలడంతో అతి చిన్న వార్డుగా మారిపోయింది. అమల్లోకి వచ్చిన కోడ్ ఈ నెల 17న కేంద్రం ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్లో కొనసాగుతున్న మున్సిపల్ విధులు మినహా కొత్తగా ఎలాంటి టెండర్ల ప్రకటన, ఖరారు, ప్రారంభోత్సవాలు ఉండవని స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ బోర్డు సభ్యులు తనకు వినతి పత్రం ఇచ్చినట్లు సీఈఓ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా రాజకీయ పార్టీల, ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. -
కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల తేదీ ప్రకటించిన రక్షణశాఖ
-
కంటోన్మెంట్లో ఉద్రిక్తత
టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నేతల హంగామా ఇరువర్గాల మధ్య తోపులాట కారు అద్దాలు ధ్వంసం ఉప ముఖ్యమంత్రి ఎదుట ఘటన కంటోన్మెంట్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభపర్వానికి తెరలేపాయి. ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన రాజకీయపార్టీల నేతలంతా వార్డుల్లోనే తిష్టవేశారు. పగలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఓటర్లకు తాయిలాలను అందజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అధికార టీఆర్ఎస్ నేతలు వార్డుల్లో డబ్బులు పంచుతున్నార ని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదంతా ఉపముఖ్యమంత్రి సమక్షంలో చోటుచేసుకోవడం గమనార్హం. నాలుగోవార్డు పరిధిలోని పికెట్‌లో టీఆర్ఎస్ బలపరిచిన నళిని కిరణ్‌కు మద్దతుగా గురువా రం డిప్యూటీ సీఎం రాజయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత డీబీ దేవేందర్ వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఓ వాహనం అద్దాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు క్షణాల్లో ఘటనా స్థలికి చేరుకునేలోపు అంతా పారిపోయారు. రూటు మారిన ఫ్లాగ్‌మార్చ్.. బేగంపేట ఏసీపీ పరిధిలో ‘ఫ్లాగ్ మార్చ్’ నిర్వహిస్తున్న పోలీసులు గొడవ సమాచారం తెలుసుకుని తమ ర్యాలీని పికెట్‌కు మళ్లించారు. బేగంపేట ఏసీపీ గణేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సుమారు 200మంది పోలీసు సిబ్బంది ఘనటాస్థలికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి పద్మారావు, మాజీ బోర్డు సభ్యుడు, టీఆర్ఎస్ అభ్యర్థిని నళిని తండ్రి వెంకట్రావు నివాసంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అంతకు మునుపే వెంకట్రావు నివాసం వద్ద ఉన్న నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పీవై గిరి, ఏసీపీలు తిరుపతి, శివకుమార్, ఇన్స్పెక్టర్లు మంత్రులను సంప్రదించి విషయం తెలుసుకున్నారు. ‘మేము ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించడం లేదని, మీ పని మీరు చేయాలని’ మంత్రులు పోలీసులకు సూచించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు మారేడ్‌పల్లి పోలీసులు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు. డబ్బులు పంచే సంస్కృతి మాది కాదు:రాజయ్య ఉద్యమ పార్టీగా పేరొందిన టీఆర్ఎస్కు డబ్బులు పంచే సంస్కృతి లేదని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. గురువారం పికెట్‌లో గొడవ జరగడంతో సుమారు రెండుగంటల విరామం అనంతరం ఆయన తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బులు పంచే అలవాటు లేదన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కంటోన్మెంట్‌నూ మిగతా తెలంగాణ ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ బోర్డు పరిధిలోని మొత్తం ఎనిమిది వార్డుల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కచ్చితంగా ఆరు స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
హోరు.. పోరు..
కంటోన్మెంట్: కంటోన్మెంట్ కదనరంగం వేడెక్కింది. ఈనెల 11న జరగనున్న బోర్డు ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ర్యాలీలు, పాదయాత్రలు, ధూంధాంలతో ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ఏకంగా వార్డుకో మంత్రిని నియమించి గెలుపు బాధ్యతలను అప్పగించడంతో సగం కేబినేట్ ఇక్కడే తిష్టవేసింది. విపక్షాల నుంచి రాజకీయ ఉద్ధండుల వారసులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలే అయినా, ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తమ ప్యానల్ అభ్యర్థుల విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు సైతం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న 2, 3, 5వ వార్డుల్లోనూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున సగం మంది మంత్రులు, డిప్యూటీ స్పీకర్, విప్‌లు, 20 మంది ఎమ్మెల్యేలు కంటోన్మెంట్లో మోహరించారు. మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వారం రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మం త్రులు టి.హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు రెండు రోజులుగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, విప్ ఓదేలు, 20 మందికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కంటోన్మెంట్లో ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. పార్టీ బలహీనంగా ఉన్న వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్కు అన్ని వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులే ఉన్నా నాలుగు వార్డుల్లో రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఎంపీ, ఎమ్మెల్యేలకు సవాలే.. తెలుగు దేశం పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలకు బోర్డు ఎన్నికలు సవాల్‌గా మారాయి. నాలుగోవార్డు నుంచి స్వయంగా తన కూతురు లాస్య నందితను రంగంలోకి దింపిన సాయన్న ఆమె గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక సమయాన్ని ఆ వార్డుకే కేటాయిస్తున్నారు. ఎంపీ మల్లారెడ్డి 1, 6వ వార్డుల్లో గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్తీకి ఓ కీలక నేతను ఇన్చార్జిలుగా నియమించారు. ఒకటోవార్డులో రఘువీర్ సింగ్, ఆరోవార్డులో బాణాల శ్రీనివాస్‌రెడ్డి గెలుపును ఆయన అత్యంత కీలకంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆపసోపాలు.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన కూతురు సుహాసిని (రెండోవార్డు), కుమారుడు (నవనీత్)లను ఎన్నికల బరిలో నిలిపారు. ఇక ఏడో వార్డులో పి.భాగ్యశ్రీ, ఎనిమిదో వార్డులో ఖదీరవన్ మాత్రమే బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నాలుగోవార్డులో బోర్డు బరిలో నాలుగు సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన డీబీ దేవేందర్ ఈ సారి తన కూతురు అంబికను పోటీలో నిలిపారు. సానుభూతి ఓట్లపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ వార్డులో కాంగ్రెస్‌కే చెందిన మరో నేత వెంకటేశ్ భార్య సుశీల కూడా ప్రధాన పోటీదారుల్లో ఒకరు కావడం గమనార్హం. ఐదో వార్డులో వార్డులో సర్వే కుమారుడు నవనీత్తోపాటు వార్డు అధ్యక్షుడు సంకి రవీందర్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అల్లుడు రాజేశ్‌లు సైతం పార్టీ అభ్యర్థులుగానే బరిలో ఉన్నారు. ఇక ఒకటి, మూడు, ఆరోవార్డులోని పార్టీ అభ్యర్థుల పోటీ నామమాత్రంగానే ఉంది. ఎవరినీ ఉపేక్షించం అనుమతి లేకుండా ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొంటే కేబినెట్ మంత్రులనైనా ఉపేక్షించేది లేదు. బోర్డు ఎన్నికల్లో మోడల్ కోడ్ ఉల్లంఘనలను సీరియస్‌గా పరిగణిస్తాం. ఇటీవల గాయత్రి గార్డెన్స్, జీవీఆర్ గార్డెన్స్‌లో కొందరు మంత్రుల ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినట్టు మా దృష్టికొచ్చింది. వీటిపై పోలీసు అనుమతుల వివరాలు, తమ సిబ్బంది వీడియో రికార్డుల ఆధారంగా సోమవారం సభ నిర్వాహకులకు నోటీసులు పంపిస్తాం. ఇప్పటివరకు 87 మందికి ఉల్లంఘన నోటీసులు పంపాం. అనుమతి లేకుండా ఫంక్షన్ హాళ్లలో ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా ఉండేలా చూడాల్సిందిగా హోంమంత్రి, సీఎస్, డీజీపీలకు ప్రత్యేకంగా లేఖలు పంపుతున్నాం. - విఠల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
బరిలో వీరు...గెలిచేదెవరో!
కేంద్ర మాజీ మంత్రి సర్వే కుమారుడు, కుమార్తె ఎమ్మెల్యే సాయన్న కూతురు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి మంజుల రసవత్తరంగా కంటోన్మెంట్ ఎన్నికలు కంటోన్మెంట్ : దీంతో ఎనిమిది వార్డుల నుంచి మొత్తం 114 మంది బరిలో నిలిచినట్లయింది. రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్న ప్రముఖ నేతల వారసులు ఈసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు మొత్తం 173 మంది నామినేషన్లు దాఖలు చేయగా, శుక్రవారం 59 మంది ఉపసంహరించుకున్నారు.సారి పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీనితో అందరి దృష్టి ఈ ఎన్నికల పైనే పడింది. రెండోవార్డు నుంచి సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని, ఐదో వార్డు నుంచి సర్వే కుమారుడు ఎస్. నవనీత్ పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్ మాజీ ఉద్యోగి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి భార్య మంజుల రెడ్డి రెండు, ఏడు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఆమె 2006లో బోర్డు ఎన్నికల్లో గెలుపొంది, మూడు నెలల పాటు బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. మళ్లీ ఈసారి బరిలోకి దిగుతుండటం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. ఎమ్మెల్యే సాయన్న తన కుమార్తె జి.లాస్య నందితను నాలుగో వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిపారు. వీరితో పాటు కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.నర్సింగ్‌రావు కుమారుడు డీఎన్ సంజీవరావు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి కుమారుడు కనుకుల తిరుపతి రెడ్డి రెండో వార్డు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డికి మేనల్లుడు కూడా. ఇక రెండో వార్డు నుంచి తిరిగి పోటీ చేస్తున్న మాజీ బోర్డు సభ్యుడు సాద కేశవరెడ్డి, ఒకటో వార్డు నుంచి బరిలో ఉన్న జక్కుల మహేశ్వర్‌రెడ్డిలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి సమీప బంధువులు. వీరితో పాటు స్థానిక బోర్డు సభ్యుల వారసులు పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నాల్లో ఉన్నారు. ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాలి. వార్డుకో మంత్రికి ఇన్‌ఛార్జి బాధ్యతలు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ వార్డుకో మంత్రికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. త్వరలో వార్డుల వారీగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహం రచించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమాత్యులంతా కంటోన్మెంట్ ప్రచారానికి తరలిరానుండడంతో బోర్డు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.