ఎన్నికల షెడ్యూల్ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బోర్డు అధికారులు
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 17న కేంద్రం ఎన్నికల తేదీ ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బోర్డు అధికారులు ప్రత్యేక బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ఖరారు చేశారు. కేంద్రం ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తదనుగుణంగా ఓటరు జాబితా ప్రకటన, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం, నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, గుర్తుల కేటాయింపు తదితర తేదీలను బోర్డు అధికారులు ప్రకటించారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు.
పార్టీల ప్రమేయం లేదు..
►సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండానే ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందిస్తారు.
►ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్–2007కు అనుగుణంగా రూపొందించిన ఓటరు జాబితాలో ఫొటోలు ఉండవు, కేవలం ఓటర్ల పేరు, చిరునామా మాత్రమే ఉంటాయి.
►అయితే ఎన్నికల సంఘం గుర్తించిన ప్రామాణిక గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి ఉంటేనే ఓటింగ్‌కు అనుమతిస్తారు.
►రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా నిర్వహించే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, బోర్డు అధికారులు సూచించిన 70 గుర్తుల జాబితా నుంచి గుర్తు కేటాయిస్తారు.
వార్డుల రిజర్వేషన్లు ఇలా..
ది కంటోన్మెంట్స్ యాక్ట్ 2006 అమల్లోకి వచ్చాక, ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ –2007 ఆధారంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను 2008లోనే ఎనిమిది వార్డులగా విభజించారు.
►2008 ఎన్నికల్లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌లు అమలు చేశారు. అప్పట్లో 1, 5, 6 వార్డులు మహిళలకు, 8 వార్డు ఎస్సీ జనరల్ కేటగిరీగా రిజర్వేషన్‌లు అమలు చేశారు.
►మళ్లీ 2015లో జరిగిన ఎన్నికల్లో 1,5, 6 వార్డులను జనరల్‌గా మార్చి మిగిలిన నాలుగు జనరల్ వార్డుల్లో మూడింటిని లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించారు. దీంతో 3,4,7 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
►తాజా ఎన్నికల కోసం 2019లోనే మళ్లీ రొటేషన్ పద్ధతిలో మిగిలిన నాలుగు జనరల్ వార్డుల్లో మూడింటి కోసం లాటరీ తీయగా 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
►2011 జనాభా లెక్కల ప్రకారం వరుసగా మూడో సారి ఎనిమిదో వార్డు ఎస్సీలకు రిజర్వ్ అవుతూ వస్తోంది.
1,32,722 మంది ఓటర్లు
గతేడాది సెప్టెంబర్ 15న ప్రకటించిన జాబితా ప్రకారం ఎనిమిది వార్డులకు గానూ మొత్తం 2,32,722 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇదే జాబితాలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. 2015 ఎన్నికలతో పోలిస్తే (1,63,630 ) 30,908 మంది ఓటర్లు తగ్గారు. 2015 ఎన్నికల తర్వాత ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఓటు హక్కు కల్పించ వద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు రెండు విడతల్లో సుమారు 45 వేల ఓట్లు తొలగించారు. కొత్త ఓటర్లు నమోదుతో కలపడం ద్వారా తాజా ఓటర్లు సంఖ్య 1.32,722కు చేరింది. 2015లో 23,667 ఓట్లతో ఆరోవార్డు అతిపెద్దదిగా ఉండగా, ప్రస్తుతం 22,919 మంది ఓటర్లతో ఐదో వార్డు అతిపెద్దదిగా కొనసాగుతోంది. 2018 నాటికి 32,705 మంది ఓటర్లతో కొనసాగిన రెండో వార్డులో భారీగా ఓట్ల తొలగింపు చేపట్టడంతో ప్రస్తుతం కేవలం 7,872 మంది మాత్రమే మిగలడంతో అతి చిన్న వార్డుగా మారిపోయింది.
అమల్లోకి వచ్చిన కోడ్
ఈ నెల 17న కేంద్రం ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్‌లో కొనసాగుతున్న మున్సిపల్ విధులు మినహా కొత్తగా ఎలాంటి టెండర్ల ప్రకటన, ఖరారు, ప్రారంభోత్సవాలు ఉండవని స్పష్టం చేశారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ బోర్డు సభ్యులు తనకు వినతి పత్రం ఇచ్చినట్లు సీఈఓ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా రాజకీయ పార్టీల, ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment