Secunderabad Cantonment Board
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్‌ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. రక్షణ శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా, రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే.. మరోవైపు కంటోన్మెంట్ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్కొనసాగుతుండగా, బోర్డు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెట్వికాస్మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై 23న విచారణ జరగనుంది. -
కంటోన్మెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 17న కేంద్రం ఎన్నికల తేదీ ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బోర్డు అధికారులు ప్రత్యేక బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ఖరారు చేశారు. కేంద్రం ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తదనుగుణంగా ఓటరు జాబితా ప్రకటన, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం, నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, గుర్తుల కేటాయింపు తదితర తేదీలను బోర్డు అధికారులు ప్రకటించారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు. పార్టీల ప్రమేయం లేదు.. ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండానే ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందిస్తారు. ►ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్–2007కు అనుగుణంగా రూపొందించిన ఓటరు జాబితాలో ఫొటోలు ఉండవు, కేవలం ఓటర్ల పేరు, చిరునామా మాత్రమే ఉంటాయి. ►అయితే ఎన్నికల సంఘం గుర్తించిన ప్రామాణిక గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి ఉంటేనే ఓటింగ్‌కు అనుమతిస్తారు. ►రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా నిర్వహించే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, బోర్డు అధికారులు సూచించిన 70 గుర్తుల జాబితా నుంచి గుర్తు కేటాయిస్తారు. వార్డుల రిజర్వేషన్లు ఇలా.. ది కంటోన్మెంట్స్ యాక్ట్ 2006 అమల్లోకి వచ్చాక, ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ –2007 ఆధారంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను 2008లోనే ఎనిమిది వార్డులగా విభజించారు. ►2008 ఎన్నికల్లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పట్లో 1, 5, 6 వార్డులు మహిళలకు, 8 వార్డు ఎస్సీ జనరల్ కేటగిరీగా రిజర్వేషన్లు అమలు చేశారు. ►మళ్లీ 2015లో జరిగిన ఎన్నికల్లో 1,5, 6 వార్డులను జనరల్‌గా మార్చి మిగిలిన నాలుగు జనరల్ వార్డుల్లో మూడింటిని లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించారు. దీంతో 3,4,7 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ►తాజా ఎన్నికల కోసం 2019లోనే మళ్లీ రొటేషన్ పద్ధతిలో మిగిలిన నాలుగు జనరల్ వార్డుల్లో మూడింటి కోసం లాటరీ తీయగా 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ►2011 జనాభా లెక్కల ప్రకారం వరుసగా మూడో సారి ఎనిమిదో వార్డు ఎస్సీలకు రిజర్వ్ అవుతూ వస్తోంది. 1,32,722 మంది ఓటర్లు గతేడాది సెప్టెంబర్ 15న ప్రకటించిన జాబితా ప్రకారం ఎనిమిది వార్డులకు గానూ మొత్తం 2,32,722 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇదే జాబితాలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. 2015 ఎన్నికలతో పోలిస్తే (1,63,630 ) 30,908 మంది ఓటర్లు తగ్గారు. 2015 ఎన్నికల తర్వాత ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఓటు హక్కు కల్పించ వద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు విడతల్లో సుమారు 45 వేల ఓట్లు తొలగించారు. కొత్త ఓటర్లు నమోదుతో కలపడం ద్వారా తాజా ఓటర్లు సంఖ్య 1.32,722కు చేరింది. 2015లో 23,667 ఓట్లతో ఆరోవార్డు అతిపెద్దదిగా ఉండగా, ప్రస్తుతం 22,919 మంది ఓటర్లతో ఐదో వార్డు అతిపెద్దదిగా కొనసాగుతోంది. 2018 నాటికి 32,705 మంది ఓటర్లతో కొనసాగిన రెండో వార్డులో భారీగా ఓట్ల తొలగింపు చేపట్టడంతో ప్రస్తుతం కేవలం 7,872 మంది మాత్రమే మిగలడంతో అతి చిన్న వార్డుగా మారిపోయింది. అమల్లోకి వచ్చిన కోడ్ ఈ నెల 17న కేంద్రం ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్లో కొనసాగుతున్న మున్సిపల్ విధులు మినహా కొత్తగా ఎలాంటి టెండర్ల ప్రకటన, ఖరారు, ప్రారంభోత్సవాలు ఉండవని స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ బోర్డు సభ్యులు తనకు వినతి పత్రం ఇచ్చినట్లు సీఈఓ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా రాజకీయ పార్టీల, ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. -
Secunderabad: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేనట్టే!
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఆశలు ఆవిరయ్యాయి. రెండేళ్లుగా పార్లమెంట్ ఎజెండాలో ఉంటూ వస్తున్న నూతన బిల్లుకు ఈసారి కూడా ఆమోదానికి నోచుకోలేదు. నూతన బిల్లు ఆమెదం తర్వాతే ఎన్నికలంటూ చెప్పిన కేంద్రం మరో పక్క కంటోన్మెంట్లను సమీపం మున్సిపాలిటీల్లో కలిపే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత రాష్ట్రాలకు తమ అభిప్రాయాలు తెలపాలంటూ లేఖలు రాసింది. ఈ వారమే తెలంగాణ ప్రభుత్వం తన సమ్మతిని తెలుపుతూ సమాధానం ఇచ్చింది. రాష్ట్ర సర్కారు ఆమోదమే తరువాయి అన్నట్లుగా ఎదురు చూస్తున్న కేంద్రం అంతకు ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సికింద్రాబాదే ఎందుకు? దేశంలోనే అతిపెద్దది, భూవినియోగం, వివాదాల పరంగా సంక్షిష్టమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తోనే విలీన ప్రక్రియను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక మొత్తంలో 2,800 వందల ఎకరాల బీ–2 స్థలం (రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు స్థలం) సికింద్రాబాద్‌లోనే ఉంది. ఇక 16 సివిలియన్ బజార్లు, 117 ఓల్డ్ గ్రాంట్ బంగళాలూ ఉన్నాయి. ఆయా స్థలాలకు సంబంధించిన సివిల్ వివాదాలూ వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో విలనం జరిగితే పలు కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని కంటోన్మెంట్లలో ఉన్న సివిల్ ఏరియాలను కలుపుకొనేందుకు షరతులు విధించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సివిల్ ఏరియాల విలీనానికి ముందుకొచ్చింది. ఆర్మీ కోరిక మేరకే.. 1998లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సివిల్ ఏరియాలను ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరింది. ఇందుకు కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగానే స్పందించినప్పటికీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో సివిల్ ఏరియాల విలీనం డిమాండ్ పలుచనవుతూ వచ్చింది. తాజాగా సివిల్ ప్రాంతాలను తమ నుంచి వేరు చేయాలంటూ (ఎక్సీషన్) రక్షణ బలగాలే కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సుమిత్ బోస్ కమిటీ సైతం ఈ ప్రతిపాదనను సమర్థించింది. దీంతో కేంద్రం ఓ పక్క కంటోన్మెంట్ల విలీనంపై కసరత్తు చేస్తూనే, నూతన బిల్లు రూపొందించింది. విలీనానికే మొగ్గుచూపుతూ రెండేళ్లుగా కంటోన్మెంట్ నూతన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఆశలు ఆవిరి 2021 ఫిబ్రవరి 11 నాటికి గత పాలకమండలి గడువు ముగిసింది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్రం, నూతన బిల్లు రూపకల్పన పేరిట జాప్యం చేస్తూ వచ్చింది. ఇదే విషయమై గత పార్లమెంట్ సమావేశాల్లోనూ నూతన బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలంటూ ప్రకటన చేసింది. మరోసారి బిల్లుకు మోక్షం లభించకపోవడం, విలీన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఇక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో కంటోన్మెంట్ ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలకు నిరాశ తప్పడం లేదు. (క్లిక్ చేయండి: రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!) -
కంటోన్మెంట్లో శశికళ ట్యాక్స్ డిఫాల్టర్!
రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని వైనం హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్యాక్స్ డిఫాల్టర్! మారేడ్‌పల్లి రాధిక కాలనీలో శశికళ నటరాజన్ పేరిట ఉన్న ప్లాట్ నెంబర్ 16లోని ఇంటికి సంబంధించి రెండేళ్లకు రూ. 35,424 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం బకాయిల వసూలు లక్ష్యంగా కంటోన్మెంట్ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు పంపిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు, శశికళ పేరిట ఉన్న ఇంటికీ నోటీసు పంపారు. 1990 ప్రాంతంలో జయలలిత నగర శివారులోని జీడిమెట్ల గ్రామపరిధిలో జేజే గార్డెన్ పేరిట వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సమయంలోనే, మారేడ్‌పల్లిలో శశికళ పేరిట ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో తరచూ హైదరాబాద్‌కు వచ్చే సమయాల్లో జయలలిత ఇక్కడ నివాసం ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ–2గా సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చిన సందర్భంలో ఆమె పేరిట నగరంలో ఉన్న ఆస్తుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలం క్రితం ప్రైవేటు వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారని, నాలుగేళ్లుగా సదరు నివాసం ఖాళీగానే ఉంటోందని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆమె ఆస్తి అక్రమమా లేక సక్రమమా అనే చర్చ మొదలైంది.