కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఆశలు ఆవిరయ్యాయి. రెండేళ్లుగా పార్లమెంట్ ఎజెండాలో ఉంటూ వస్తున్న నూతన బిల్లుకు ఈసారి కూడా ఆమోదానికి నోచుకోలేదు. నూతన బిల్లు ఆమెదం తర్వాతే ఎన్నికలంటూ చెప్పిన కేంద్రం మరో పక్క కంటోన్మెంట్‌లను సమీపం మున్సిపాలిటీల్లో కలిపే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత రాష్ట్రాలకు తమ అభిప్రాయాలు తెలపాలంటూ లేఖలు రాసింది. ఈ వారమే తెలంగాణ ప్రభుత్వం తన సమ్మతిని తెలుపుతూ సమాధానం ఇచ్చింది. రాష్ట్ర సర్కారు ఆమోదమే తరువాయి అన్నట్లుగా ఎదురు చూస్తున్న కేంద్రం అంతకు ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
సికింద్రాబాదే ఎందుకు?
దేశంలోనే అతిపెద్దది, భూవినియోగం, వివాదాల పరంగా సంక్షిష్టమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తోనే విలీన ప్రక్రియను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక మొత్తంలో 2,800 వందల ఎకరాల బీ–2 స్థలం (రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు స్థలం) సికింద్రాబాద్‌లోనే ఉంది.
ఇక 16 సివిలియన్ బజార్‌లు, 117 ఓల్డ్ గ్రాంట్ బంగళాలూ ఉన్నాయి. ఆయా స్థలాలకు సంబంధించిన సివిల్ వివాదాలూ వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో విలనం జరిగితే పలు కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని కంటోన్మెంట్‌లలో ఉన్న సివిల్ ఏరియాలను కలుపుకొనేందుకు షరతులు విధించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సివిల్ ఏరియాల విలీనానికి ముందుకొచ్చింది.
ఆర్మీ కోరిక మేరకే..
1998లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సివిల్ ఏరియాలను ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరింది. ఇందుకు కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగానే స్పందించినప్పటికీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో సివిల్ ఏరియాల విలీనం డిమాండ్ పలుచనవుతూ వచ్చింది. తాజాగా సివిల్ ప్రాంతాలను తమ నుంచి వేరు చేయాలంటూ (ఎక్సీషన్) రక్షణ బలగాలే కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సుమిత్ బోస్ కమిటీ సైతం ఈ ప్రతిపాదనను సమర్థించింది. దీంతో కేంద్రం ఓ పక్క కంటోన్మెంట్‌ల విలీనంపై కసరత్తు చేస్తూనే, నూతన బిల్లు రూపొందించింది. విలీనానికే మొగ్గుచూపుతూ రెండేళ్లుగా కంటోన్మెంట్ నూతన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా నిలిపివేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ఆశలు ఆవిరి
2021 ఫిబ్రవరి 11 నాటికి గత పాలకమండలి గడువు ముగిసింది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్రం, నూతన బిల్లు రూపకల్పన పేరిట జాప్యం చేస్తూ వచ్చింది. ఇదే విషయమై గత పార్లమెంట్ సమావేశాల్లోనూ నూతన బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలంటూ ప్రకటన చేసింది. మరోసారి బిల్లుకు మోక్షం లభించకపోవడం, విలీన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఇక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో కంటోన్మెంట్ ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలకు నిరాశ తప్పడం లేదు. (క్లిక్ చేయండి: రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!)
Comments
Please login to add a commentAdd a comment