కంటోన్మెంట్‌లో ఉద్రిక్తత | Cantonment tension | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌లో ఉద్రిక్తత

Published Fri, Jan 9 2015 12:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కంటోన్మెంట్‌లో ఉద్రిక్తత - Sakshi

కంటోన్మెంట్‌లో ఉద్రిక్తత

టీఆర్‌ఎస్ నేతలు డబ్బులు
పంచుతున్నారంటూ కాంగ్రెస్ నేతల హంగామా
ఇరువర్గాల మధ్య తోపులాట    కారు అద్దాలు ధ్వంసం
ఉప ముఖ్యమంత్రి ఎదుట ఘటన
 

కంటోన్మెంట్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభపర్వానికి తెరలేపాయి. ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన రాజకీయపార్టీల నేతలంతా వార్డుల్లోనే తిష్టవేశారు. పగలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఓటర్లకు తాయిలాలను అందజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అధికార టీఆర్‌ఎస్ నేతలు వార్డుల్లో డబ్బులు పంచుతున్నార ని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదంతా ఉపముఖ్యమంత్రి సమక్షంలో చోటుచేసుకోవడం గమనార్హం.   నాలుగోవార్డు పరిధిలోని పికెట్‌లో టీఆర్‌ఎస్ బలపరిచిన నళిని కిరణ్‌కు మద్దతుగా గురువా రం డిప్యూటీ సీఎం రాజయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత డీబీ దేవేందర్ వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఓ వాహనం అద్దాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు క్షణాల్లో ఘటనా స్థలికి చేరుకునేలోపు అంతా పారిపోయారు.
 
రూటు మారిన ఫ్లాగ్‌మార్చ్..

బేగంపేట ఏసీపీ పరిధిలో ‘ఫ్లాగ్ మార్చ్’ నిర్వహిస్తున్న పోలీసులు గొడవ సమాచారం తెలుసుకుని తమ ర్యాలీని పికెట్‌కు మళ్లించారు. బేగంపేట ఏసీపీ గణేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సుమారు 200మంది పోలీసు సిబ్బంది ఘనటాస్థలికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి పద్మారావు, మాజీ బోర్డు సభ్యుడు, టీఆర్‌ఎస్ అభ్యర్థిని నళిని తండ్రి వెంకట్రావు నివాసంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అంతకు మునుపే వెంకట్రావు నివాసం వద్ద ఉన్న నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పీవై గిరి, ఏసీపీలు తిరుపతి, శివకుమార్, ఇన్‌స్పెక్టర్లు మంత్రులను సంప్రదించి విషయం తెలుసుకున్నారు. ‘మేము ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించడం లేదని, మీ పని మీరు చేయాలని’ మంత్రులు పోలీసులకు  సూచించారు. అనంతరం  బాధితుల ఫిర్యాదు మేరకు మారేడ్‌పల్లి పోలీసులు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు.

డబ్బులు పంచే సంస్కృతి మాది కాదు:రాజయ్య

ఉద్యమ పార్టీగా పేరొందిన టీఆర్‌ఎస్‌కు డబ్బులు పంచే సంస్కృతి లేదని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. గురువారం పికెట్‌లో గొడవ జరగడంతో సుమారు రెండుగంటల విరామం అనంతరం ఆయన తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బులు పంచే అలవాటు లేదన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కంటోన్మెంట్‌నూ మిగతా తెలంగాణ ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ బోర్డు పరిధిలోని మొత్తం ఎనిమిది వార్డుల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కచ్చితంగా ఆరు స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement