సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీలన్నీ అప్పుడే హడావుడి ప్రారంభించాయి. హ్యాట్రిక్ కోసం గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కమలం, హస్తం పార్టీలు కూడా పాలమూరులో పాగా వేసేందుకు కుస్తీలు పడుతున్నాయి. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. జిల్లాల విభజనలో షాద్‌నగర్ సెగ్మెంట్ రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది. కొడంగల్ సెగ్మెంట్‌లోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిసాయి.
చదవండి: బీజేపీ క్లియర్‌కట్ మెసేజ్.. పట్టు దొరికిందా?
తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల హవా నడిచింది. బీజేపీ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు సెగ్మెంట్లలో ఉనికి చాటుకునేది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రామమోహన్‌రెడ్డి, నారాయణపేట నుంచి టీడీపీ టిక్కెట్ మీద గెలిచిన రాజేందర్‌రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ బలం తొమ్మిదికి చేరింది. రెండు ఎంపీ సీట్లలో ఒకటి టీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
2018 ఎన్నికల్లో 13 స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. కొల్లాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత ఆయన కూడా కారు ఎక్కేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ. మరో ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుంటామని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ సర్వేలో సగం మంది గెలుపు కష్టమని తేల్చినట్లు సమాచారం. దీంతో ఎవరి సీటు పోతుందో అన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అనుమానం ఉన్నవారు సొంత సర్వేలు చేయించుకుని జాతకాలు పరీక్షించుకుంటున్నారు.
రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి పథకాలను ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళుతున్నారు. అయితే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష రూపాయల రుణమాఫీ, కొత్త పెన్షన్లు, దళితబంధు పథకాల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా నిరుద్యోగుల్లో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యులు ప్రభుత్వం మీద కొంత ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అంతర్గత కలహాలు, అసంతృప్తులతో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే...తర్వాత పార్టీలో ఉంటారో లేరో అన్న అనుమానంతో ఓటు వేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, సీనియర్ నేతలు మల్లు రవి, నాగం జనార్థనరెడ్డి వంటి ఎందరో సీనియర్లు జిల్లా నుంచి ఎదిగినవారే. అయినా టీఆర్‌ఎస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. పైగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడానికి కూడా పెద్దగా ప్రయత్నించడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కొన్ని సెగ్మెంట్లలో పోటీ చేయడానికి బలమైన నాయకులు కూడా లేనంత దుస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక...ఆయన సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఆందోళనలతో కేడర్‌లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కార్యకర్తల ఉత్సాహాన్ని సక్రమ మార్గంలో నడిపించేవిధంగా పార్టీ అడుగులు పడటంలేదు. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అధ్యక్షుల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రయత్నం కూడా చేయకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది.
ఇక కేంద్రంలో ఉన్న అధికారంతో దూకుడు మీదున్న కమలం పార్టీ జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి కాషాయ సేనలో చేరడంతో ఆ పార్టీ కేడర్‌లో జోష్ పెరిగింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ బహిరంగ సభ కూడా పార్టీకి మంచి ఊపు తెచ్చింది. అంతేగాకుండా జాతీయ సమావేశాలకు వచ్చిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి, కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఐదారు అసెంబ్లీ సీట్లు గెలవాలని లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది.
రాష్ట్ర స్థాయిలో వేడెక్కిన రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరికి వారు తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి లక్ష్యాలకు అనుగుణంగా కార్యరంగంలోకి అడుగుపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment