సాక్షి, వికారాబాద్: కాండ్లాపూర్ నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసు మిస్టరీగా మారుతోంది. యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించి కూడా పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఈ క్రమంలో కాండ్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు శిరీష తండ్రిపైనా దాడి చేశారు.
శిరీషను హత్య చేసిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయని, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయలు ఉండడంతో పోలీసులు దాడిగా అనుమానిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాల నేపథ్యంలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం శిరీష ఇంటికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్ వైష్ణవి నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇందులోనూ పోలీసులు ఏం తేల్చలేదు.
‘‘యువతి కళ్లకు కట్టెలు లేదంటే రాళ్లు గుచ్చుకుని ఉండొచ్చు. పరీక్ష రిపోర్టును ఎఫ్‌ఎస్‌ఎల్(FSL)కు పంపించాం. రిపోర్టు రావాలి’’ అని డాక్టర్ వైష్ణవి తెలిపారు. అయితే అత్యాచారం జరిగిందా? అనే ప్రశ్నకు ఆమె స్పష్టత ఇవ్వలేదు. రిపోర్ట్ వస్తేనేగానీ తెలియదు చెప్పారు. ఈ క్రమంలో ఆమె అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోగా.. గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు.
ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేసే యత్నం జరుగుతుందని ఆరోపిస్తూ శిరీష బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ‘‘మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. రేపు మా వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాదని గ్యారెంటీ ఏంటి?. కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామ’’ని గ్రామస్తులు అంటున్నారు.
శాంతింపజేసిన పోలీసులు
శిరీష కేసులో ఆందోళన చేపట్టిన కాండ్లాపూర్ గ్రామస్తుల్ని పోలీసులు శాంతింపజేశారు. నచ్చజెప్పడంతో వాళ్లు నిరసనను ఆపినట్లు తెలుస్తోంది.
నోరు విప్పని బావ
ఇక శిరీష హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శిరీష బావ అనిల్ నోరు విప్పలేదు. ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులకు అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే చేతిపై, గొంతు దగ్గర కోసుకుని తనను, ఆమె తండ్రిని బెదిరించిందని అనిల్ చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆమె ఫోన్ లాక్కున్నాడని, ఆమె బయటి నుంచి గడియ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు అనిల్ పోలీసులకు చెప్పాడు. ఆపై ఆమె ఊరు శివారులో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తొలుత భావించారు.
అయితే కళ్లు పొడిచి ఉండడం, కాళ్లు చేతులకు గాయాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. ఇంట్లో గొడవ జరిగితే శిరీష తండ్రి మాత్రం పొంతన లేని సమాధానం చెప్తుండడం, మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఇంట్లో గొడవలకి కారణాలేంటన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: అప్సర మొదటి భర్త ఆత్మహత్య.. కార్తీక్ తల్లి సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment