Vikarabad SP Press Meet On Sirisha Case, Shocking Details Revealed - Sakshi
Sakshi News home page

బావే మట్టుపెట్టాడు.. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే శిరీష హత్య జరిగింది

Published Wed, Jun 14 2023 9:30 PM | Last Updated on Thu, Jun 15 2023 12:48 PM

Vikarabad SP Press Meet On Sirisha Case Shocking Details - Sakshi

మరదలు శిరీషపై కన్నేసి.. లొంగకపోవడంతోనే మట్టుబెట్టినట్లు 

సాక్షి, వికారాబాద్‌:సంచలనం సృష్టించిన పారామెడికల్‌ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్‌ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి  ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు.

శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్‌కు దురాలోచన ఉంది. అయితే శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్‌లలో మరో వ్యక్తితో చాటింగ్‌ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌లో కోపం పెరిగింది. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు..  బావ అనిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్‌ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్‌ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్‌ ఆమెతో గొడపడ్డాడు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు.

జరిగింది ఇదే..
వికారాబాద్‌ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్‌ పూర్తిచేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్‌ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్‌ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్‌ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్‌ వచ్చిన అనిల్‌.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.

ఇదీ చదవండి: భర్తతో విడిపోయినవాళ్లే ఆ బాబా టార్గెట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement