vikarabad police
-
శారీరక సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదనే శిరీష హత్య
సాక్షి, వికారాబాద్:సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు. శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్‌కు దురాలోచన ఉంది. అయితే శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్లలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌లో కోపం పెరిగింది. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు.. బావ అనిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్ ఆమెతో గొడపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు. జరిగింది ఇదే.. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తిచేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్ వచ్చిన అనిల్.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదీ చదవండి: భర్తతో విడిపోయినవాళ్లే ఆ బాబా టార్గెట్ -
కష్టపడి ఎస్ఐ అయ్యాడు.. పెళ్లయి కూడా 5 రోజులే.. విధుల్లో చేరేందుకు వెళ్తూ..
చింతపల్లి: కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. 5 రోజు ల క్రితమే పెళ్లి అయ్యింది. ఉద్యోగంలో చేరి సాఫీగా జీవితం గడపాలనుకున్న అతడిని విధి వెక్కిరించింది. విధుల్లో చేరడానికి స్వ గ్రామం నుంచి తండ్రితో కలసి బయలుదేరగా.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లిరాంనగర్ సమీపంలో సాగర్ హైవేపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యతండాకు చెందిన నేనావత్ మాన్యనాయక్(50)ది వ్యవసాయ కుటుంబం. ఇతని కుమారుడు నేనావత్ శ్రీను(30) ఎస్ఐగా శిక్షణ పూర్తి చేసుకొని వికారాబాద్ టౌన్‌కు పోస్టింగ్ అందుకున్నా డు. శనివారం పలువురు కుటుంబసభ్యుల తో కలసి ఆటోలో మాన్యతండా నుం చి హైదరాబాద్‌కు తండ్రీకొడుకులు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పోలేపల్లిరాంనగర్ వద్ద ఆటోను ఢీకొట్టింది. శ్రీను, మాన్యనాయక్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ సత్యం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, శ్రీనుకు వికారాబాద్ టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ రావడంతో రిపోర్ట్ చేయాల్సి ఉంది. పెళ్లి తంతు ముగిసిన అనంతరం విధుల్లో చేరాలని భావించాడు. ఎస్ఐగా రిపోర్ట్ చేసేందుకు వెళ్తూనే మృతిచెందాడు. పెళ్లయిన ఐదు రోజులకే.. నేనావత్ శ్రీను వివాహం మాల్ వెంకటేశ్వరనగర్‌లో ఐదు రోజుల క్రితం జరిగింది. పోలీసు శాఖలో ఎస్ఐగా ఉద్యోగం సాధించడంతో కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని పెళ్లి చేసుకున్నాడు. అంతలోనే మృత్యువు కబళించింది. -
నాలుగు మాటలు.. ఆరు హత్యలు..
వికారాబాద్: ఒంటరి మహిళలతో స్నేహం చేయడం.. మద్యం తాగించి, మాయమాటలు చెప్పడం.. పథకం ప్రకారం హత్య చేయడం.. ఆపై బంగారం, డబ్బు దోచుకోవడం.. ఇదీ ఓ కిరాతకుడి బాగోతం.. ఇలా ఇప్పటికి ఆరు హత్యలు చేశాడు. గతంలో పలుసార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును ఛేదిస్తున్న పోలీసులకు కిల్లర్ పట్టుబడ్డాడు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్పపై పలు కేసులు నమోదయ్యాయి. ధారూర్ మండలం అవుసుపల్లికి చెందిన అమృతమ్మ (38) కూలీ పనులు చేసేందుకు వికారాబాద్‌లోని అడ్డాకు వచ్చింది. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో భర్త చంద్రయ్య వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సిరిగేట్‌పల్లి రైల్వే గేటు సమీపంలో పొలం పక్కన మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరున్నారు. ఆ మృతదేహం అమృతమ్మదేనని గుర్తించారు. మృతురాలి శరీరంపై నగలు లేకపోవడాన్ని గమనించిన పోలీసులు ఎవరో బంగారం, నగదు కోసమే హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో ఆరా.. దర్యాప్తులో భాగంగా వికారాబాద్‌లోని కూలీల అడ్డా వద్దకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో కేసును ఛేదించే యత్నం చేశారు. ఆ రోజు ఉదయం అడ్డా నుంచి ఆటోలో అమృతమ్మ ఆలంపల్లి వైపు వెళ్లినట్లు గమనించారు. దీంతో పాటు ఓ బంగారం తాకట్టు దుకాణంలో బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయగా ఆధార్ కార్డు లేకపోవడంతో పెట్టుకోలేదు. హత్య ఇలా చేశాడు.. అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్ప అమృతమ్మకు ఉదయం కల్లు తాగించాడు. అనంతరం ఆటోలో కొత్తగడి వైపు వెళ్లి సిరిగేట్‌పల్లికి వెళ్లే రోడ్డు వద్ద ఆటో దిగారు. ఇద్దరూ నడుచుకుంటూ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. ఈమె మద్యం మత్తులో ఉండగా, హత్య చేసి పారిపోయినట్లుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని పారిపోయాడు. 1985 నుంచి నేర చరితుడే.. 50 ఏళ్ల కిష్టప్ప ధారూరు పరిధిలో 1985లో మొదటి హత్య చేయగా, 2008లో వికారాబాద్ పీఎస్ పరిధిలో ఓ హత్య చేశాడు. 2008లో తాండూరులో హత్య చేసి బంగారం దోచుకున్నాడు. 2010లో యాలాల పీఎస్ పరిధిలో సెల్‌ఫోన్, డబ్బుల కోసం హత్య చేశాడు. 2016లో వికారాబాద్‌లో హత్య చేసి డబ్బు, సెల్‌ఫోన్ తీసుకున్నాడు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు పాల్గొనగా, మిగతావన్నీ తాను ఒక్కడు చేసినవే. మహిళలను హత్య చేయడంతో పాటు రెండు కేసుల్లో మహిళలను గుర్తు పట్టకుండా కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు. -
పీఎస్‌లో ‘గాడిద’ పంచాయితీ!
వికారాబాద్ అర్బన్: ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో ఎటూ తేల్చలేక వికారాబాద్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదల పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద 22 గాడిదలు ఉండగా నాలుగు తప్పిపోయాయి. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాడిదలను వెతికి ఆచూకీ చెబితే పట్టుకొచ్చి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఇటీవల మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించిన ప్రభు.. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు గాడిదను వికారాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ గాడిద తనదేనంటూ పద్మ అనే మహిళ తన తండ్రి సత్తయ్యతో కలిసి పీఎస్‌కు చేరుకుంది. వీరిద్దరూ గాడిద నాదంటే.. నాదే అనడంతో ఏం చేయాలో తోచని పోలీసులు.. మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు. -
రెండు నెలలు.. 18 హత్యలు
తాండూరులో ఇటీవల జరిగిన ఓ ప్రతీకార హత్య కలకలం సృష్టించింది. గతేడాది తన తల్లిదండ్రులను ఆస్తితగాదాల నేపథ్యంలో బాబాయి హత్య చేశాడనే కక్షతో మృతుల కుమారుడు అతడిని దారుణంగా చంపేశాడు. తన తల్లిదండ్రులను చంపిన మాదిరిగానే.. అదే స్థలంలో చంపడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈనెల 7న కొత్తూరు మండలం సిద్ధాపూర్లో తండ్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కుమారుడు చంపేశాడు. బంధాలు ఎటు వెళ్తున్నాయి.. జనం పుట్టుకతో వచ్చిన బంధాలు, అనుబంధాలను విస్మరించి.. చిన్నచిన్న తగాదాలు, కక్షలు, ఇతర కారణాలతో తన వాళ్లను కడతేర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మైలార్‌దేవ్‌పల్లిలో అత్తాకోడలి దారుణ హత్య ఉమ్మడి జిల్లాతోపాటు నగరంలో కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు వారిని అతిదారుణంగా చంపేశారు. రెండు నెలల పరిధిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 హత్య జరగడంతో పోలీసులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడే పోలీసులు ఇరువర్గాలను ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్ చేస్తే కొంత మార్పు వస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. షాద్‌నగర్ టౌన్: క్షణికావేశం, కక్షలు, చిన్నచిన్న సమస్యలు పెద్దవి కావడంతో హత్యలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొందరు సొంతవారినే కడతేర్చుతున్నారు. అదేవిధంగా వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. నేరాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయి. చిన్నచిన్న తగాదాలపై సకాలంలో స్పందించకపోవడంతో హత్యలు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. మార్చి 4న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎల్ఐజీ కాలనీలో ఇళ్లలో పని చేస్తూ పొట్టపోసుకుంటున్న స్వరూపను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. అదేనెల 6న చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మతిస్థిమితం కోల్పోయిన మంగలి యాదమ్మ తన భర్త వెంకటయ్యపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. అనంతరం ‘మీ నాన్నను చం పేశాన’ని ఆమె తన కుమారుడి వద్దకు వెళ్లి చెప్పడంతో కలకలం రేగింది. మార్చి 14న నవాబుపేట మండలం చిట్టిగిద్దకు చెందని యువకుడు షేక్ సోహెల్ ఇంట్లోనుంచి వెళ్లి తిరిగి రాలేదు. లింగంపల్లిగుట్ట మీద దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించాడు. దుండగులు వైరుతో సోహెల్ గొంతుకు బిగించి హతమార్చారు. 15వ తేదీ రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నరెడ్లగూడ గ్రామానికి చెందిన ముక్కు రాంమోహన్‌ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. బండరాళ్లతో మోది ఓ ఓ ఫాంహౌస్‌లో పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. మార్చి 18న శంకర్పల్లి పరిధిలోని మోకిలి శివారులో ఉన్న ఓ వెంచర్లో గుడ్డు కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రఘువీర్, విక్రం, అర్జున్ ఇనుపరాడ్లుతో కొట్టి అంతమొందించారు. మార్చి 19న శంషాబాద్ మండలం చౌదరిగూడ శివారులోని ఓ వెంచర్లో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని మహిళను దండగులు చంపేసి మృతదేహాన్ని కాల్చివేశారు. 23న తాండూరు పట్టణంలో జరిగిన ప్రతీకార హత్య సంచలనం రేపింది. సీతారాంపేటకు చెందిన అబ్దుల్ సత్తార్, షరీఫ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో షరీఫ్ తన అన్న అబ్దుల్సత్తార్తో పాటు వదిన ఫహీమున్సిసాబేగంను గతేడాది బండరాయితో మోది హత్య చేశాడు. తన తల్లిదండ్రులను చంపేయడంతో అబ్దుల్ సత్తార్ కుమారుడు అబ్దుల్లా బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. మార్చి 23న తన స్నేహితులతో కలిసి అబ్దుల్లా బాబాయిపై కర్ర, బండారాయితో దాడి చేసి చంపేశాడు. అయితే, తన తల్లిదండ్రులను చంపేసిన మాదిరిగానే, అదే స్థలంలో అం తమొందించడం కలకలం రేపింది. తాండూరు మండలం రాంపూర్ తండాకు చెందిన రుక్కిబాయి, డప్పు దశరథ్ దంపతులు. రుక్కిబాయిపై అనుమానం పెంచుకుంటున్న దశరథ్ మార్చి 25న ఇంట్లో నిద్రిస్తుండగా రోకలి, పారతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. మార్చి 26న ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మహల్‌ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు వివాహిత అయిన జంగం మంగమ్మ ఒంటిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. వివాహేతర సం బంధం నేపథ్యంలో వారిమధ్య గొడవలు ఉన్నాయి. చికిత్స పొందుతూ మంగమ్మ ప్రాణం విడిచింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైనుద్దీన్ మార్చి 24న హత్యకు గురయ్యాడు. మైనుద్దీన్ తండ్రి రుక్మొద్దీన్ సోదరులు సద్దాం, జహంగీర్ ఆయనను చంపేశారు. ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు. మార్చి 27న రాజేంద్రనగర్ ఎంఎంపహడీ ప్రాంతంలో నదీమ్ గ్యాంగ్ వార్‌కు బలయ్యాడు. తన స్నేహితుడికి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గంమధ్యలో జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది యువకుడి హత్యకు దారి తీసింది. పెద్దేముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన బాల్‌రాజ్, ఎర్రమరియమ్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా మరియమ్మ ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానించిన బాల్‌రాజ్ ఆమెను హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో మార్చి 31న పొలంలో ఉరివేసి హతమార్చాడు. మార్చి 31న చేవేళ్ల మండలం ఊరెళ్ల గ్రామానికి వెళ్లే దారిలో సాగర్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న ఓ వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 2న వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్ద తండాకు చెందిన ఆంగోత్ జంకిబాయిని దాయాది అయిన హరియానాయక్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తన బోరు నీళ్లు ఎందుకు పారించుకున్నావని ఆమె అడగడంతో దారుణానికి పాల్పడ్డాడు. యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన కంబాలపల్లి బాలయ్య, ఆయన కుమారుడు జంగయ్య, అతడి భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రీకొడుకు మధ్య విబేధాలు రావడంతో క్షణికావేశానికి గురైన కొడుకు జంగయ్యపై రోకలితో దాడి చేయడంతో ప్రాణం విడిచాడు. ఏప్రిల్ 13న వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్‌లో రచ్చబండ సాక్షిగా నరేష్ అనే యువరైతు దారుణ హత్యకు గురయ్యాడు. నరేష్‌కు సంబంధించిన మేక జొన్న పంటలోకి వెళ్లి మేసింది. పొలం యజమాని అశోక్ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే ఈ విషయాన్ని నరేష్ ఇంట్లో వచ్చి చెప్పగా రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. రావులపల్లి అశోక్, నర్సింలు, నందు, శ్రీనివాస్, శేఖర్ మారుణాయుదాలతో వచ్చి దాడి చేశారు. చికిత్స పొందుతూ నరేష్ మృతిచెందాడు. ఏప్రిల్ 19న రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగ్ మూసీ కల్వర్టు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ దారుణహత్యకు గురైంది. దుండగులు ఆమెను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి చంపేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఏప్రిల్ 22న యాచారం మండలం చింతుల్ల గ్రామంలో నాగరవితేజ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతడు మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. అయితే పౌల్ట్రీలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యతో నాగరవితేజకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి పథకం ప్రకారం చింతల్ల– అయ్యవారిగూడెం మధ్యలో ఇనుపరాళ్లతో కొట్టి హతమార్చారు. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కొడుకు తం డ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఈనెల 7న కొత్తూరు మండలం సిద్దాపూర్లో వెలుగు చూసింది. సామరస్యంగా పరిష్కరించుకోవాలి తాండూరు టౌన్: చిన్నచిన్న విషయాలను పెద్దగా చేసి గొడవలకు దిగి చంపుకోవడం అమానుషం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆస్తి తగాదా అయిన, పొలం తగాదైనా.. మరేదైనా అందరూ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సగం సమస్య పరిష్కారమవుతుంది. అక్కడ పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతే కానీ క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జైలుకు వెళ్తే కుటుంబీకులు రోడ్డునపడతారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరఫున పలు అంశాలపై కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. – రామచంద్రుడు, డీఎస్పీ, తాండూరు డబ్బుల కోసమే హత్య తండ్రిని చంపిన తనయుడి అరెస్టు కొత్తూరు: డబ్బుల కోసం తండ్రిని చంపిన తనయుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. స్థానిక ఠాణాలో రూరల్ సీఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని సిద్ధాపూర్‌కు చెందిన గుండెమోని చంద్రయ్య(60)కు కుమారులు అంజయ్య, లక్ష్మయ్య ఉన్నారు. అంజయ్య వేరుగా నివాసం ఉండగా చంద్రయ్య తన భార్య సత్యమ్మ, చిన్న కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే, లక్ష్మయ్య పనీపాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతోపాటు తన ఖర్చుల కోసం తరచూ తండ్రితో గొడవపడుతుండేవాడు. ఈక్రమంలో తండ్రిని చంపేస్తే ఉన్న భూమిని పంచుకొని తన వాటాను విక్రయిస్తే డబ్బులు వస్తాయని లక్ష్మయ్య భావించాడు. ఈనెల 5న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తలపై కట్టెతో బలంగా కొట్టి పారిపోయాడు. కుటుంబీకులు చంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి 7న మృతి చెందాడు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు కొత్తూరులోని రాధాగార్డెన్ వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సాక్షి, యాలాల / వికారాబాద్ : శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సిరిమానగారి అనంతయ్య (55), భార్య లక్ష్మి (45), కుమార్తె శివకళ, తాండూరుకు చెందిన తుల్జమ్మ (38), భారతమ్మ (45) వేర్వేరుగా సోమవారం యాలాల మం డలం జుంటుపల్లిలో జరిగిన రామస్వామి జాతరకు వచ్చారు. అనంతరం వారంతా తాండూరు వెళ్లేందుకు అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్ ఆటోలో ఎక్కారు. ఐదుగురు ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్న ఆటోను దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళుతున్న ఓ లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతను తప్పించబోయి డ్రైవర్ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనంతయ్య, లక్ష్మి, తుల్జమ్మ, భారతమ్మæ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్ అశోక్, శివకళ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఉపేందర్, యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వాహనంలో చిక్కుకున్న బాలిక శివకళ... ఇన్సెట్లో అనంతయ్య (ఫైల్) ,తుల్జమ్మ మృతదేహం -
మానవత్వం చూపిన ఖాకీలు
- పిచ్చివాడికి బట్టలు వేసిన పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంభించాలనే ఆదేశాలున్నాయి. దానికి తగ్గట్టే పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. గురువారం పట్టణంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నా ఓ పిచ్చివాన్ని బట్టలు లేకుండా గమనించిన పోలీసులు బట్టలు తెచ్చి అతనికి రోడ్డుపైనే వేశారు. దీంతో ఆవైపు ప్రయాణించే వారంతా పోలీసులను మెచ్చుకున్నారు. పోలీసులు మానవత్వం చాటుకుని బట్టలు ఇప్పించడం సంతోషంగా ఉందని పలువురు ప్రశంసించారు. - వికారాబాద్ రూరల్ -
అడ్డుగా ఉన్నాడనే అంతం
వికారాబాద్: వ్యక్తి హత్య మిస్టరీని వికారాబాద్ పోలీసులు ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. వారం రోజుల క్రితం పట్టణంలోని ఏసీఆర్ జూబ్లీకాలనీలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి కేసు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్కు చెందిన ఇబ్రహీంఅలీ, ఫరీదాబేగం దంపతులు. ఇబ్రహీంఅలీ కూలీపనులు చేస్తుండగా భార్య స్థానిక మహావీర్ అస్పత్రిలో వంట మనిషి. కొంతకాలంగా ఇబ్రహీంఅలీ మద్యానికి బానిసయ్యాడు. శివారెడ్డిపేటకు చెందిన ఆయన పెద్దఅక్క కొడుకు జమీల్‌తో ఫరీదాబేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కారు డ్రైవర్ అయిన జమీల్ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. అప్పుడప్పుడు స్వస్థలానికి వస్తూ తమ ‘సంబంధా’న్ని కొనసాగిస్తుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంఅలీ పలుమార్లు భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కుంగిపోయాడు. ఎప్పటికైనా ఇబ్రహీంఅలీ తమకు అడ్డుగా ఉన్నాడని, ఆయనను ఎలాగైనా హత్య చేయాలని ఫరీదాబేగం పథకం పన్ని ప్రియుడు జమీల్‌కు చెప్పింది. ఈ నేపథ్యంలో జమీల్ వికారాబాద్‌లోని కొత్తగంజ్‌లో ఉంటున్న తన స్నేహితుడైన ఓ హోటల్ యజమాని యూసుఫ్‌ను ఫోన్లో సంప్రదించాడు. ఎలాగైనా ఇబ్రహీంఅలీని చంపేయాలని కోరాడు. చంపడం తనతో కాదని.. తన హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న అశుకు డబ్బులు ఇస్తే ఆ పని చేస్తాడని యూసుఫ్ చెప్పాడు. దీంతో సుపారీ రూ.2 లక్షలకు కుదిరింది. యూసుఫ్ ఖాతాలో జమీల్ రూ.29,500లను వేశా డు. మిగతా డబ్బు పని పూర్తయ్యాక ఇస్తానని చెప్పాడు. దీంతో అశు, ఇబ్రహీంఅలీతో కలిసి ఈ నెల 1న రాత్రి ఏసీఆర్ జూబ్లీకాలనీలో మద్యం తాగాడు. పథకం ప్రకారం అశు ఇబ్రహీంఅలీకి ఎక్కువగా మద్యం తాగించాడు. అనంతరం బీరు బాటిల్ పగులగొట్టిన అశు లేవలేని స్థితిలో ఉన్న ఇబ్రహీంఅలీ గొంతు కోసి హత్యచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫరీదాబేగం, జమీల్ల ఫోన్‌కాల్‌లపై దృష్టి సారించారు. ఈమేరకు ఫరీదాబేగంను అదుపులోకి తీసుకొని విచారించగా పైవివరాలు తెలిపింది. ఈమేరకు పోలీసులు యూసుఫ్, అశులను అరెస్టు చేసి సోమవారం ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో సీఐ రవి,ఎస్ఐ శేఖర్లతో పాటు ఐడీ పార్టీ పోలీసులు రమేష్, బాలు ఉన్నారు.