రెండు నెలలు.. 18 హత్యలు | Vikarabad Murder Cases History | Sakshi
Sakshi News home page

రెండు నెలలు.. 18 హత్యలు

Published Thu, May 9 2019 11:43 AM | Last Updated on Thu, May 9 2019 11:43 AM

Vikarabad Murder Cases History - Sakshi

తాండూరులో ఇటీవల జరిగిన ఓ ప్రతీకార హత్య కలకలం సృష్టించింది. గతేడాది తన తల్లిదండ్రులను ఆస్తితగాదాల నేపథ్యంలో బాబాయి హత్య చేశాడనే కక్షతో మృతుల కుమారుడు అతడిని దారుణంగా చంపేశాడు. తన తల్లిదండ్రులను చంపిన మాదిరిగానే.. అదే స్థలంలో చంపడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈనెల 7న కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో తండ్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కుమారుడు చంపేశాడు.

బంధాలు ఎటు వెళ్తున్నాయి..  జనం పుట్టుకతో వచ్చిన బంధాలు, అనుబంధాలను  విస్మరించి.. చిన్నచిన్న తగాదాలు, కక్షలు, ఇతర కారణాలతో తన వాళ్లను కడతేర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మైలార్‌దేవ్‌పల్లిలో అత్తాకోడలి దారుణ హత్య ఉమ్మడి జిల్లాతోపాటు నగరంలో కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు వారిని అతిదారుణంగా చంపేశారు. రెండు నెలల పరిధిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 హత్య జరగడంతో పోలీసులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడే పోలీసులు ఇరువర్గాలను ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తే కొంత మార్పు వస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


షాద్‌నగర్‌ టౌన్‌: క్షణికావేశం, కక్షలు, చిన్నచిన్న సమస్యలు పెద్దవి కావడంతో హత్యలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొందరు సొంతవారినే కడతేర్చుతున్నారు. అదేవిధంగా వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. నేరాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయి. చిన్నచిన్న తగాదాలపై సకాలంలో స్పందించకపోవడంతో హత్యలు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. 

మార్చి 4న వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌ ఎల్‌ఐజీ కాలనీలో ఇళ్లలో పని చేస్తూ పొట్టపోసుకుంటున్న స్వరూపను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో గొంతుకోసి దారుణంగా హతమార్చారు.  
అదేనెల 6న చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మతిస్థిమితం కోల్పోయిన మంగలి యాదమ్మ తన భర్త వెంకటయ్యపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. అనంతరం ‘మీ నాన్నను చం పేశాన’ని ఆమె తన కుమారుడి వద్దకు వెళ్లి చెప్పడంతో కలకలం రేగింది.   
మార్చి 14న నవాబుపేట మండలం చిట్టిగిద్దకు చెందని యువకుడు షేక్‌ సోహెల్‌ ఇంట్లోనుంచి వెళ్లి తిరిగి రాలేదు. లింగంపల్లిగుట్ట మీద దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించాడు. దుండగులు వైరుతో సోహెల్‌ గొంతుకు బిగించి హతమార్చారు.  
15వ తేదీ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నరెడ్లగూడ గ్రామానికి చెందిన ముక్కు రాంమోహన్‌ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. బండరాళ్లతో మోది ఓ ఓ ఫాంహౌస్‌లో పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది.  
మార్చి 18న శంకర్‌పల్లి పరిధిలోని మోకిలి శివారులో ఉన్న ఓ వెంచర్‌లో గుడ్డు కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రఘువీర్, విక్రం, అర్జున్‌ ఇనుపరాడ్లుతో కొట్టి అంతమొందించారు.  
మార్చి 19న శంషాబాద్‌ మండలం చౌదరిగూడ శివారులోని ఓ వెంచర్‌లో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని మహిళను దండగులు చంపేసి మృతదేహాన్ని కాల్చివేశారు.   
23న తాండూరు పట్టణంలో జరిగిన ప్రతీకార హత్య సంచలనం రేపింది. సీతారాంపేటకు చెందిన అబ్దుల్‌ సత్తార్, షరీఫ్‌ అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో షరీఫ్‌ తన అన్న అబ్దుల్‌సత్తార్‌తో పాటు వదిన ఫహీమున్సిసాబేగంను గతేడాది బండరాయితో మోది హత్య చేశాడు. తన తల్లిదండ్రులను చంపేయడంతో అబ్దుల్‌ సత్తార్‌ కుమారుడు అబ్దుల్లా బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. మార్చి 23న తన స్నేహితులతో కలిసి అబ్దుల్లా బాబాయిపై కర్ర, బండారాయితో దాడి చేసి చంపేశాడు. అయితే, తన తల్లిదండ్రులను చంపేసిన మాదిరిగానే, అదే స్థలంలో అం తమొందించడం కలకలం రేపింది.   
తాండూరు మండలం రాంపూర్‌ తండాకు చెందిన రుక్కిబాయి, డప్పు దశరథ్‌ దంపతులు. రుక్కిబాయిపై అనుమానం పెంచుకుంటున్న దశరథ్‌ మార్చి 25న ఇంట్లో నిద్రిస్తుండగా రోకలి, పారతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు.  
మార్చి 26న ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మహల్‌ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు వివాహిత అయిన జంగం మంగమ్మ ఒంటిపై కిరోసిన్‌ పోసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. వివాహేతర సం బంధం నేపథ్యంలో వారిమధ్య గొడవలు ఉన్నాయి. చికిత్స పొందుతూ మంగమ్మ ప్రాణం విడిచింది.  
వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైనుద్దీన్‌ మార్చి 24న హత్యకు గురయ్యాడు. మైనుద్దీన్‌ తండ్రి రుక్మొద్దీన్‌ సోదరులు సద్దాం, జహంగీర్‌ ఆయనను చంపేశారు. ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు.   

  • మార్చి 27న రాజేంద్రనగర్‌ ఎంఎంపహడీ ప్రాంతంలో నదీమ్‌ గ్యాంగ్‌ వార్‌కు బలయ్యాడు. తన స్నేహితుడికి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గంమధ్యలో జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది యువకుడి హత్యకు దారి తీసింది.  
  • పెద్దేముల్‌ మండలం జనగామ గ్రామానికి చెందిన బాల్‌రాజ్, ఎర్రమరియమ్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా మరియమ్మ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానించిన బాల్‌రాజ్‌ ఆమెను హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో మార్చి 31న పొలంలో ఉరివేసి హతమార్చాడు.   
  • మార్చి 31న చేవేళ్ల మండలం ఊరెళ్ల గ్రామానికి వెళ్లే దారిలో సాగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎదురుగా ఉన్న ఓ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు.  
  • ఏప్రిల్‌ 2న వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్‌ పెద్ద తండాకు చెందిన ఆంగోత్‌ జంకిబాయిని దాయాది అయిన హరియానాయక్‌ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తన బోరు నీళ్లు ఎందుకు పారించుకున్నావని ఆమె అడగడంతో దారుణానికి పాల్పడ్డాడు.  
  • యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన కంబాలపల్లి బాలయ్య, ఆయన కుమారుడు జంగయ్య, అతడి భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రీకొడుకు మధ్య విబేధాలు రావడంతో క్షణికావేశానికి గురైన కొడుకు జంగయ్యపై రోకలితో దాడి చేయడంతో ప్రాణం విడిచాడు.   
  • ఏప్రిల్‌ 13న వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్‌లో రచ్చబండ సాక్షిగా నరేష్‌ అనే యువరైతు దారుణ హత్యకు గురయ్యాడు. నరేష్‌కు సంబంధించిన మేక జొన్న పంటలోకి వెళ్లి మేసింది. పొలం యజమాని అశోక్‌ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే ఈ విషయాన్ని నరేష్‌ ఇంట్లో వచ్చి చెప్పగా రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. రావులపల్లి అశోక్, నర్సింలు, నందు, శ్రీనివాస్, శేఖర్‌ మారుణాయుదాలతో వచ్చి దాడి చేశారు. చికిత్స పొందుతూ నరేష్‌ మృతిచెందాడు.  
  • ఏప్రిల్‌ 19న రాజేంద్రనగర్‌ పరిధిలోని నార్సింగ్‌ మూసీ కల్వర్టు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ దారుణహత్యకు గురైంది. దుండగులు ఆమెను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి చంపేసి పెట్రోలు పోసి నిప్పంటించారు.   
  • ఏప్రిల్‌ 22న యాచారం మండలం చింతుల్ల గ్రామంలో నాగరవితేజ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతడు మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. అయితే పౌల్ట్రీలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యతో నాగరవితేజకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి పథకం ప్రకారం చింతల్ల– అయ్యవారిగూడెం మధ్యలో ఇనుపరాళ్లతో కొట్టి హతమార్చారు.  
  • ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కొడుకు తం డ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన  ఈనెల 7న కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో వెలుగు చూసింది.  

సామరస్యంగా పరిష్కరించుకోవాలి 
తాండూరు టౌన్‌: చిన్నచిన్న విషయాలను పెద్దగా చేసి గొడవలకు దిగి చంపుకోవడం అమానుషం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆస్తి తగాదా అయిన, పొలం తగాదైనా.. మరేదైనా అందరూ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సగం సమస్య పరిష్కారమవుతుంది. అక్కడ పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతే కానీ క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జైలుకు వెళ్తే కుటుంబీకులు రోడ్డునపడతారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌ శాఖ తరఫున పలు అంశాలపై కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. – రామచంద్రుడు, డీఎస్పీ, తాండూరు  

డబ్బుల కోసమే హత్య తండ్రిని చంపిన తనయుడి అరెస్టు  

కొత్తూరు: డబ్బుల కోసం తండ్రిని చంపిన తనయుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. స్థానిక ఠాణాలో రూరల్‌ సీఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని సిద్ధాపూర్‌కు చెందిన గుండెమోని చంద్రయ్య(60)కు కుమారులు అంజయ్య, లక్ష్మయ్య ఉన్నారు. అంజయ్య వేరుగా నివాసం ఉండగా చంద్రయ్య తన భార్య సత్యమ్మ, చిన్న కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే,  లక్ష్మయ్య పనీపాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు.

దీంతోపాటు  తన ఖర్చుల కోసం తరచూ తండ్రితో గొడవపడుతుండేవాడు. ఈక్రమంలో తండ్రిని చంపేస్తే ఉన్న భూమిని పంచుకొని తన వాటాను విక్రయిస్తే డబ్బులు వస్తాయని లక్ష్మయ్య భావించాడు. ఈనెల 5న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తలపై కట్టెతో బలంగా కొట్టి పారిపోయాడు. కుటుంబీకులు చంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి 7న మృతి చెందాడు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు కొత్తూరులోని రాధాగార్డెన్‌ వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణ తదితరులు ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement