అడ్డుగా ఉన్నాడనే అంతం
వికారాబాద్: వ్యక్తి హత్య మిస్టరీని వికారాబాద్ పోలీసులు ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. వారం రోజుల క్రితం పట్టణంలోని ఏసీఆర్ జూబ్లీకాలనీలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి కేసు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్‌కు చెందిన ఇబ్రహీంఅలీ, ఫరీదాబేగం దంపతులు. ఇబ్రహీంఅలీ కూలీపనులు చేస్తుండగా భార్య స్థానిక మహావీర్ అస్పత్రిలో వంట మనిషి. కొంతకాలంగా ఇబ్రహీంఅలీ మద్యానికి బానిసయ్యాడు.
శివారెడ్డిపేటకు చెందిన ఆయన పెద్దఅక్క కొడుకు జమీల్‌తో ఫరీదాబేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కారు డ్రైవర్ అయిన జమీల్ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. అప్పుడప్పుడు స్వస్థలానికి వస్తూ తమ ‘సంబంధా’న్ని కొనసాగిస్తుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంఅలీ పలుమార్లు భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కుంగిపోయాడు. ఎప్పటికైనా ఇబ్రహీంఅలీ తమకు అడ్డుగా ఉన్నాడని, ఆయనను ఎలాగైనా హత్య చేయాలని ఫరీదాబేగం పథకం పన్ని ప్రియుడు జమీల్‌కు చెప్పింది. ఈ నేపథ్యంలో జమీల్ వికారాబాద్‌లోని కొత్తగంజ్‌లో ఉంటున్న తన స్నేహితుడైన ఓ హోటల్ యజమాని యూసుఫ్‌ను ఫోన్‌లో సంప్రదించాడు. ఎలాగైనా ఇబ్రహీంఅలీని చంపేయాలని కోరాడు. చంపడం తనతో కాదని.. తన హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న అశుకు డబ్బులు ఇస్తే ఆ పని చేస్తాడని యూసుఫ్ చెప్పాడు.
దీంతో సుపారీ రూ.2 లక్షలకు కుదిరింది. యూసుఫ్ ఖాతాలో జమీల్ రూ.29,500లను వేశా డు. మిగతా డబ్బు పని పూర్తయ్యాక ఇస్తానని చెప్పాడు. దీంతో అశు, ఇబ్రహీంఅలీతో కలిసి ఈ నెల 1న రాత్రి ఏసీఆర్ జూబ్లీకాలనీలో మద్యం తాగాడు. పథకం ప్రకారం అశు ఇబ్రహీంఅలీకి ఎక్కువగా మద్యం తాగించాడు. అనంతరం బీరు బాటిల్ పగులగొట్టిన అశు లేవలేని స్థితిలో ఉన్న ఇబ్రహీంఅలీ గొంతు కోసి హత్యచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫరీదాబేగం, జమీల్‌ల ఫోన్‌కాల్‌లపై దృష్టి సారించారు. ఈమేరకు ఫరీదాబేగంను అదుపులోకి తీసుకొని విచారించగా పైవివరాలు తెలిపింది. ఈమేరకు పోలీసులు యూసుఫ్, అశులను అరెస్టు చేసి సోమవారం ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో సీఐ రవి,ఎస్‌ఐ శేఖర్‌లతో పాటు ఐడీ పార్టీ పోలీసులు రమేష్, బాలు ఉన్నారు.