మరణించిన పాపతో తల్లి సూర్యకుమారి
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): బిడ్డ తాగిన పాలు కక్కేస్తుందని ఆ తల్లి వారపు సంతలో కొని తెచ్చుకొన్న అనాస మందును పట్టించడంతో పొత్తిళ్లలోని బిడ్డ చనిపోగా ఆ తల్లికి కడుపుకోత తప్పలేదు. రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామం అమ్మిరేఖల గ్రామానికి చెందిన బోనెం లోవకుమారికి తొలి కాన్పులో పుట్టిన మూడు నెలల పసిపాప గురువారం కాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యకుమారి జూలై 22న రాజవొమ్మంగి పీహెచ్‌సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప పూర్తి ఆరోగ్యంతో ఉండగా రెండు రోజుల క్రితం వాంతులు, రొంప, ఊపిరి అందక ఇబ్బంది పడింది.
తన బిడ్డ రొంపతో బాధపడుతూ పాలు కక్కేసుకొంటోందని ఈనెల 3వ తేదీ బుధవారం రాజవొమ్మంగి పీహెచ్‌సీకు వైద్యం కోసం వెళ్లింది. ఆ పాపను పరీక్షించిన స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి వంశీ పాప ఆరోగ్యంగానే ఉందని కొన్ని మందులు ఇచ్చి పంపారు. ఇంటికి వెళ్లిన పాప ఆ రాత్రి కంటిపై కునుకు లేకుండా ఏడవడంతో ఏం చేయాలో తెలియక వారపు సంతలో కొని తెచ్చిన అనాస మందు పొట్లాన్ని పాపకు పాలలో కలిపి పట్టించింది. తెల్లారేసరికి పాప పరిస్థితి విషమించడంతో వెంటనే మరోసారి రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. పాప పరిస్థితిని గమనించిన డాక్టర్ వంశీ అంబులెన్స్ ఇచ్చి కాకినాడ జీజీహెచ్‌కు పంపారు. అక్కడ వైద్య నిపుణులు పాపను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మరణించిన పాపతో సూర్యకుమారి గురువారం ఇంటికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment