సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రసవం చేసిన నర్సు | Nurse Negligence Child Death In Tamil Nadu | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రసవం చేసిన నర్సు

Published Tue, Oct 9 2018 12:07 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Nurse Negligence Child Death In Tamil Nadu - Sakshi

తమిళనాడు, సేలం: ప్రసవం మహిళలకు మరో జన్మలాంటిది. ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన ప్రసవాన్ని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం నర్సును విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ సేలం కార్పొరేషన్‌ కమిషనర్‌ సతీష్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం దాదగాపట్టికి చెందిన ప్రభాకరన్‌ (28) ఆడిట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కలైమణి (28). వీరిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు కుమారుడున్నాడు. కలైమణి రెండోసారి గర్భం దాల్చింది. దీంతో ఆమె ప్రతి నెల దాదగాపట్టి ప్రాథమిక వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుంటోంది. అక్టోబర్‌ 1న ప్రసవ నొప్పులు రావడంతో కలైమణిని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్స్‌ సెల్వి, ఆమె సహాయకురాలు తమిళ్‌ సెల్విలు కలైమణికి ప్రసవం చేశారు. వారు అజాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలిసింది.

దీంతో ప్రసవంలో ఇబ్బందులు తలెత్తిన కారణంగా కలైమణిని ఉన్నత చికిత్స నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ మృత శిశువు పుట్టింది. దీంతో బిడ్డ మృతదేహాన్ని తీసుకుని ప్రభాకర్‌ దంపతులు ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత రోజు వచ్చిన నర్సు సెల్వి తాను ప్రసవం చూసినందుకు రూ. 8వేలు ఇవ్వాల్సిందిగా ప్రభాకరన్‌ వద్ద డిమాండ్‌ చేసింది. అసలే తాము బిడ్డను కోల్పోయిన బాధలో ఉంటే నర్సు లంచం అడగడం ప్రభాకరన్‌ జీర్ణించుకోలేకపోయాడు. రెండు రోజుల క్రితం సేలం కార్పొరేషన్‌ కమిషనర్‌ సతీష్‌కి ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదులో తన భార్య కలైమణికి నర్సు సెల్వి, ఆమె సహాయకురాలు తమిళ్‌సెల్విలు ప్రసవం చేశారన్నారు. ఆ సమయంలో సెల్వి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రసవం చేయడంతో మృతశివువు జన్మించాడన్నారు. నర్సు సెల్వి రూ.8000 లంచం అడిగినట్టు వివరించాడు. దీనిపై విచారణ జరపాలని ఆరోగ్యశాఖ అధికారి పార్తిబన్‌కు కార్పొరేషన్‌ కమిషనర్‌ సతీష్‌ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణలో ప్రభాకరన్‌ ఫిర్యాదు నిజమని తేలింది. దీంతో నర్సు సెల్విని సస్పెండ్‌ చేస్తూ కార్పొరేషన్‌ కమిషనర్‌ సతీష్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెల్వి సహాయకురాలు తమిళ్‌సెల్విని హెచ్చరిస్తూ ఆ సంఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement