సాక్షి, ముంబై: వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్న చిన్నారుల మరణాల్లో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నాసిక్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో యావత్‌మాల్-గడ్చిరోలి, ఠాణే మూడవ స్థానంలో ఉందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. రాష్ట్రంలో పోషకాహార లోపం వల్ల మరణించిన చిన్నారుల గణాంకాలను తెలియజేయాల్సిందిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోరగా గైక్వాడ్ ఈ వివరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మరణాలు కేవలం పోషక పదార్థాల లోపం వల్లనే కాకుండా రోగాలు సోకడం, ఇతర కారణాల వల్ల కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. నిమోనియా, మలేరియా, జ్వరం, కామెర్ల వ్యాధి, డెంగీ వంటి వ్యాధులే కాకుండా ప్రమాదాల వల్ల కూడా చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మృతుల వివరాలు జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే నాసిక్ (1,563) మొదటిస్థానంలో ఉండగా, ఠాణే (833) రెండవ స్థానంలో నిలిచింది. తర్వాత పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ (427), విదర్భ, మరాఠ్వాడాలో చిన్నారుల మరణాలపై 427, 808 కేసులు నమోదయ్యాయని గైక్వాడ్ పేర్కొన్నారు.
గైక్వాడ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2012-13 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాది నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 5,400 మంది మరణించారు. గత ఏడాది ఈ సంఖ్య 5,344 . అదేవిధంగా 2010-11 మధ్య కాలంలో 6,604 చిన్నారుల మృతి కేసులు నమోదయ్యాయి. 2009-10లో 6,498 మంది చిన్నారులు, 2008-09 మధ్య కాలంలో 6,273 మంది మృత్యువాత పడ్డారు.
కాగా, నెలలు నిండక ముందు పుట్టిన శిశు మరణాలు 2011-12 మధ్య కాలంలో 19,020 నమోదు కాగా, 2010-11 మధ్య కాలంలో 21,166 నమోదయ్యాయి. అదేవిధంగా 2009-10 మధ్య కాలంలో 21,699 నమోదవ్వగా, 2008-09లో 21,543 నమోదయ్యాయని ఆమె పేర్కొంది.
మూఢనమ్మకాలు, నిరక్ష్యరాస్యత, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం, పోషకాహారం కొరవడడం తదితర కారణాల వల్లనే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఆమె పేర్కొంది. పోషకాహార లోపం వల్ల మరణించే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు తాము సిరప్, టానిక్, ఇతర ఆయుర్వేదిక్ మందులను సరఫరా చేస్తున్నామని గైక్వాడ్ తెలిపారు.
చిన్నారుల మరణాల్లో నా‘సిక్’
Published Sat, Dec 14 2013 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement