చిన్నారిని చిదిమేశారు | Step Mother Killed Daughter In Visakhapatnam | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేశారు

Published Wed, Oct 10 2018 7:19 AM | Last Updated on Mon, Oct 22 2018 1:42 PM

Step Mother Killed Daughter In Visakhapatnam - Sakshi

చిన్నారి అలేఖ్య మృతదేహం , పసిపాప తండ్రి కృష్ణను నిలదీస్తున్న స్థానికులు ,కృష్ణ రెండో భార్య దుర్గ

విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): మానవత్వం మంటగలిసింది. కర్కశత్వం పురులువిప్పింది. రాక్షసత్వం మూడేళ్ల పసిమొగ్గను చిదిమేసింది. కుటుంబ కలహాలకు చిన్నారి బలైపోయిన దారుణ ఘటన దువ్వాడ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న హృదయవిదారకరమైన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ సెక్టార్‌ – 1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న రాచబత్తుని కృష్ణ, మొదటి భార్య మీనాక్షి రైళ్లలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిన్నారి అలేఖ్యను ఇంటి వద్ద విడిచిపెట్టి సమోసాలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం మీనాక్షి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై భర్త కృష్ణకు విషయం తెలియజేసింది.

అనంతరం ఇద్దరూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి దువ్వాడ పోలీసులకు మీనాక్షి ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం కూడా పాప కోసం వెదుకుతుండగా కృష్ణ తోడల్లుడు రాజు ఇంటిని ఆనుకొని ఉన్న తుప్పల్లో అలేఖ్య మృతదేహం కనిపించింది. వెంటనే కృష్ణ దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్‌ ఏసీపీ రంగరాజు, దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్, స్టీల్‌ప్లాంట్‌ సీఐ లక్ష్మి, గాజువాక సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాప తండ్రి కృష్ణ, అతని రెండో భార్య దుర్గ, ఆమె బావ(కృష్ణ తోడల్లుడు)రాజులను వేర్వేరుగా పోలీసులు విచారించారు. కృష్ణ, రాజుల తీరుపై స్థానికంగా విచారించి వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ పాప ఉంటున్న ఇంటి వద్ద నుంచి కృష్ణ తోడల్లుడు రాజు ఇంటి వరకు వెళ్లి ఆగింది. గోడ దూకి పాపను చంపి పడేసిన స్థలం వద్దకు వెళ్లి తరువాత రాజు పక్కింటి వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్లి పాప ఇంటికి చేరుకుంది. దీంతో చిన్నారి తండ్రి కృష్ణ, తోడల్లుడు రాజుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వదిలించుకునేందుకే అంతమొందించారా..?
ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన మీనాక్షి రైళ్లలో యాచకవృత్తి చేసుకుని జీవించేది. నాలుగేళ్ల కిందట ఆమెతో కృష్ణకు పరిచయం ఏర్పడడంతో వీరిరువురు పెళ్లి చేసుకుని దువ్వాడ సెక్టార్‌ –1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. అనంతరం వీరికి చిన్నారి అలేఖ్య పుట్టింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట దుర్గ అనే యువతిని కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెదుళ్లనరవలో కాపురం పెట్టాడు. ఆమె వద్దే ఎక్కువగా ఉండే కృష్ణ ఎప్పుడైనా మొదటి భార్య మీనాక్షి వద్దకు వచ్చినా ఏదో ఒక విషయంపై గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు.

భర్త రెండో పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుండడంతో మీనాక్షి స్థానికంగా పనులు చేసుకుని, రైళ్లలో సమోసాలు అమ్ముకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లి సహాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి భార్య మీనాక్షి, కుమార్తె అలేఖ్య అడ్డు తొలగించుకోడానికి కృష్ణ, ఆయన తోడల్లుడు కలిసి ప్రణాళిక రచించి ఉంటారని పోలీ సులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా ముందు చిన్నారిని అంతమొందిస్తే మీనాక్షి భయంతో ఇక్కడి నుంచి బరంపురం వెళ్లిపోయేలా చేయాలని భావించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. అలాగే కృష్ణ రెండో భార్య దుర్గ పాత్రపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దుర్గను స్టీల్‌ప్లాంట్‌ సీఐ లక్ష్మి విచారించారు. దుర్గకు నాలుగు నెలల పాప ఉంది. పాప తండ్రి కృష్ణ, అతని తోడల్లుడు రాజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలేఖ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement