కట్టుకున్న భర్త.. కనిపెంచిన పిల్లలు.. కంటికి రెప్పలా కాపాడుకునే కుటుంబ సభ్యులు.. వీళ్లందరి పరువు బజారుకీడుస్తూ ‘ఆమె’ తన జీవితాన్ని చేజేతులా కాలరాసుకుంటోంది. తాళికి విలువ లేకుండా పోతోంది. బంధం పలుచనవుతోంది. మానవత్వం మాయమైపోతోంది. ‘చీకటి’ నిర్ణయాలతో జీవితాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షణికమైన ఆనందాలకు కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. వెనక్కు తిరిగి చూసుకుంటే.. నా అనే బంధం లేకుండా పోతోంది. ఈ కోవలో ఓ మహిళ వేసిన తప్పటడుగు ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఒకరికి మూడేళ్లు.. మరొకరికి ఆరు నెలలు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ప్రియుడు ఇద్దరు చిన్నారులను అర్ధరాత్రి నిద్రలోనే కర్కశంగాచంపి పాతిపెట్టిన ఘటన పుట్టపర్తిలో కలకలం రేపింది.