
ఒక చిన్నారి మరణం వంద ప్రశ్నల్ని లేవనెత్తింది. ఆ తల్లిదండ్రుల కడుపుకోత బ్రిటన్ చట్టాలనే బోనులో ఉంచింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్నంత మాత్రానా చేజేతులారా ఒక ప్రాణాన్ని మొగ్గలోనే తుంచేయడమేనా? మాకు కావల్సింది వ్యాధి తగ్గడం కాదు, ఆ ప్రాణం పదిలంగా ఉండటం అన్న ఆ తల్లిదండ్రులు ఆక్రందన పట్టించుకోకపోవడం ఎంతవరకు సరైనది? మెరుగైన చికిత్స ఇప్పిస్తామన్న పోప్ మాటల్ని మతం పేరుతో పెడచెవిన పెట్టి మరీ లైఫ్ సపోర్ట్ తీసేసే కఠినమైన చట్టాలను ఏం చేయాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు లండన్ వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
బ్రిటన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి అల్ఫీ ఇవాన్స్‌కి నూరేళ్లు నిండిపోయాయి. పుట్టుకతోనే అత్యంత అరుదైన మెదడుకి సంబంధించిన వ్యాధి కలిగిన కన్నబిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తల్లిదండ్రుల ఆరాటం, గత కొన్ని నెలలుగా వాళ్లు చట్టంతో చేసిన పోరాటం చివరికి గుండెకోతనే మిగిల్చాయి. తల్లిదండ్రుల కడుపుతీపి ఒకవైపు, ఆధునిక వైద్యం కూడా చేయగలిగిందేమీ లేదన్న వైద్యుల నిస్సహాయత మరోవైపు, బాలల హక్కులపై బ్రిటిష్ చట్టాలు ఇంకో వైపు, వీటన్నింటి మధ్య రెండేళ్ల చిన్నారి ప్రాణం నలిగి నలిగి అనంత వాయువుల్లో కలిసిపోయింది.
తల్లిదండ్రులు వద్దు వద్దని మొరపెట్టుకుంటున్నా, వాటికన్ సిటీలో మెరుగైన వైద్యం ఇప్పిస్తామంటూ పోప్ ఫ్రాన్సిస్ హామీ ఇచ్చినా, కోర్టులు చెప్పాయంటూ బ్రిటన్ వైద్యులు ఆ చిన్నారికి లైఫ్ సపోర్ట్ తీసివేయడంతో అల్ఫీ ఇవాన్స్ మరణించాడు. ఈ చిన్నారి మృతి ఎందరినో కదిలించింది. బాలల హక్కులపై వందల ప్రశ్నల్ని లేవనెత్తింది. వేలాది మంది ఆ బాలుడి మృతికి కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రి దగ్గర పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.
చట్టంతో తల్లిదండ్రుల పోరాటం
లండన్‌కు చెందిన టామ్ ఇవాన్స్, కేట్ జేమ్స్ దంపతులకు జన్మించిన అల్ఫీ పుట్టుకతోనే మృత్యుముఖానికి దగ్గరయ్యాడు. అత్యంత అరుదైన మెదడులో నరాలకు సంబంధించిన వ్యాధితో జన్మించాడు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా మెదడు పనిచేసే సామర్థ్యాన్ని తగ్గించి చివరికి ప్రాణాలను తీసేస్తుంది. ఏడు నెలలకే కోమాలోకి వెళ్లిపోయిన అల్ఫీ ఇవాన్స్ లండన్‌లోని లివర్‌పూల్స్ ఆల్డర్ హే చిల్డ్రన్స్ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ మీదే ఉన్నాడు.
ఇక ఆ బాలుడికి మందులేవీ పని చేయవని, లైఫ్ సపోర్ట్ తీసేయాలని చికిత్స అందించిన వైద్యులు నిర్ణయానికి వచ్చేశారు. కానీ తల్లిదండ్రుల్లో మాత్రం ఏ మూలో రెపరెపలాడే ఆశ ఉండేది. వేరే దేశాల్లో ఆ బాలుడికి చికిత్స ఇప్పించాలని అనుకున్నారు. లైఫ్ సపోర్ట్ తీయొద్దంటూ కోర్టుకెక్కారు. దీంతో ఈ బాలుడి గురించి ప్రపంచ దేశాలకు తెలిసింది. ఏకంగా పోప్ ఫ్రాన్సిస్ మద్దతు ఆ తల్లిదండ్రులకు లభించింది.
ఇవాన్స్‌కు ఇటలీ పౌరసత్వం ఇవ్వడమే కాదు మెరుగైన చికిత్స అందించడానికి ఎప్పుడంటే అప్పుడు బాలుడ్ని తీసుకురావడానికి మిలటరీ ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ బ్రిటన్ వైద్యులు మాత్రం ఆ బాలుడి వ్యాధిని ఎవరూ నయం చేయలేరని, లైఫ్ సపోర్ట్ ఇవ్వడం అంటే ఆ లేత శరీరాన్ని మరింత బాధించడమేనని వాదించారు. బ్రిటన్‌లో 1989 బాలల చట్టం ప్రకారం ఇలాంటి అరుదైన వ్యాధి సోకిన బాలలకు చికిత్స విషయంలో తల్లిదండ్రులు తమకిష్టమైన పద్ధతిలో చేయడానికి వీలు లేదు.
కోర్టులు ఏం చెబితే అలాగే నడుచుకోవాలి. బ్రిటన్‌లో కోర్టులు కూడా ఇలాంటి అరుదైన కేసుల్లో భావోద్వేగాలను, తల్లిదండ్రుల కడుపు తీపిని కాస్త కూడా పట్టించుకోవు. వైద్యుల సలహా మేరకే అవి నడుచుకుంటాయి. ఆ బాలుడికి వచ్చిన అరుదైన వ్యాధిని నయం చేయడం అసాధ్యమని మూడు దేశాల్లో ప్రముఖ వైద్యులు తేల్చేయడంతో బ్రిటన్ కోర్టులు కూడా వైద్యుల మాటకే విలువనిచ్చి లైఫ్ సపోర్ట్ తీసేయాలంటూ ఆదేశాలు ఇచ్చాయి.
అల్ఫీ మరణంతో బ్రిటన్ చట్టాలపై చర్చ జరగడమే కాదు, ఇవాన్స్ కేథలిక్ కావడం వల్లే చికిత్సకు వాటికన్ సిటీ ముందుకు వచ్చిందంటూ పసి ప్రాణానికి మతాన్ని ముడిపెట్టి కొందరు చేసిన ప్రచారం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేథలిక్ దేశాలు బ్రిటన్ వైద్యుల్ని విమర్శిస్తున్నాయి. అంత హుటాహుటిన లైఫ్ సపోర్ట్ తీయాల్సిన పనేముందని నిలదీస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment