మృతిచెందిన శిశువు బతకాలని పూజలు!
►మృతిచెందిన శిశువును బతికించేందుకు మూడు రోజులుగా పూజలు
బరంపురం(ఒడిశా): కటక్ పెద్దాస్పత్రిలో మూడేళ్ల శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించినప్పటికీ ఆ శిశువును బతికించేందుకు గ్రామస్తులు గుడ్డిగా మూఢనమ్మకంతో మూడురోజులుగా తాంత్రిక పూజలు చేసిన సంఘటన గంజాం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. మృతిచెందిన శిశువు సాయినంద్‌కు దహనసంస్కారాలు చేసేందుకు శ్మశానానికి తీసుకువెళ్లగా అక్కడ శిశువు కాళ్లు చేతులు కదలడంతో శిశువు సాయినంద్ బతికి ఉన్నట్లు అనుమానించారు. దీంతో తల్లితో సహా గ్రామస్తులు ఊరిశివారు చెట్టుకింద శిశువును ఉంచి బతికించుకునేందుకు మూడురోజులుగా తాంత్రిక పూజలు చేసిన సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేగింది.
గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం గంజాం జిల్లా ఛత్రపూర్ బ్లాక్ పరిధిలో గల సుందరపూర్ గ్రామంలో గల మజ్జిడియా వీధిలో నివాసం ఉంటున్న కుటుంబంలో 3 ఏళ్ల శిశువు సాయినంద్‌కు కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో ఛత్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. సాయినంద్ పరిస్థితి విషమించడంతో బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు కటక్ పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. కటక్ పెద్దాస్పత్రిలో శిశువు సాయినంద్‌కు వైద్యులు చికిత్స చేస్తుండగా మృతిచెందాడు.
మృతి చెందిన సాయినంద్‌ను కుటుంబసభ్యులు సుందరపూర్ సొంత గ్రామానికి తీసుకువచ్చి గ్రామస్తుల సహకారంతో దగ్గరలో ఉన్న శ్మశానానికి తరలించగా అక్కడ సాయినంద్ కాళ్లు చేతులు అడడంతో బంధువులు అనుమానంతో ఊరి శివారు మామిడి తోట కింద శిశువును ఉంచి గత 5వ తేదీ నుంచి మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారు. తాంత్రిక పూజలతో శిశువును బతికించుకోవాలని గ్రామస్తులు కూడా వెయ్యిమందికి పైగా చేరి రాత్రి పగలు పూజల్లో పాల్గొన్నారు.
సంఘటనా స్థలానికి పోలీసులు
అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా మరో రోజు ఊరుకోవాలని శిశువును బతికించుకుంటామని కుటుంబసభ్యులు పోలీసులను కోరగా వెళ్లిపోయినట్లు తెలిసింది. అధునిక ప్రపంచీకరణ యుగంలో మూఢనమ్మకాలతో ఇంకా తాంత్రిక విద్యలతో మృతశిశువును బతికించుకునేందుకు సుందరపూర్ గ్రామస్తుల ప్రయత్నం శుక్రవారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా సుందరపూర్ గ్రామస్తులు శిశువును విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.