
మృతి చెందిన శివన్యశ్రీ (ఫైల్) రోదిస్తున్న నాన్నమ్మ ధనలక్ష్మి
అన్నానగర్: మంగళం సమీపంలో ప్లాస్టిక్ తొట్టెలో ఉన్న నీటిలో ముంచి రెండున్నర ఏళ్ల కుమార్తెను ఓ కన్నతల్లి కడతేర్చింది. ఈ ఘటన మంగళం సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కరూర్ జిల్లా కులిత్తలైకి చెందిన నాగరాజ్ (23) కూలీ. ఇతను తిరుప్పూర్ సమీపం సామలపురం రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇతని భార్య తమిళ్ ఇసక్కి (21). వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల వయస్సు గల శివన్యశ్రీ అనే కుమార్తె ఉంది. నాగరాజ్ పక్కింటిలో ఇతని తండ్రి పళనిస్వామి, తల్లి ధనలక్ష్మి నివసిస్తున్నారు. రెండు రోజుల ముందు ధనలక్ష్మి ముసిరిలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లింది.
సోమవారం ఉదయం నాగరాజ్, పళనిస్వామి ఇద్దరు పనికి వెళ్లారు. ఇంట్లో తమిళ్ ఇసక్కి, శివన్యశ్రీ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ముసిరి నుంచి వచ్చిన ధనలక్ష్మి శివన్యశ్రీకి కొత్త దుస్తులు వేసింది.తరువాత శివన్యశ్రీకి పాలు ఇచ్చి పడుకోబెట్టింది. చిన్నారి నిద్రపోగానే ధనలక్ష్మి తన ఇంటి బయట కూర్చొని ఉంది. నాగరాజ్ వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నోటి నుంచి నురుగు వచ్చిన స్థితిలో శివన్యశ్రీ స్పృహతప్పి పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే చిన్నారిని కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ శివన్యశ్రీని పరీక్షించిన డాక్టర్లు, చిన్నారి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వెంటనే ధనలక్ష్మి మంగళం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కన్నతల్లిని విచారణ చేశారు. విచారణలో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ తొట్టెలో ఉన్న నీటిలో ముంచి శివన్యశ్రీని హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కన్నతల్లి తమిళ్ ఇసక్కిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment