
బాధ్యులెవరైనా వదిలిపెట్టం!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్‌దాస్ (బీఆర్‌డీ) వైద్య కళాశాలలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
ఆక్సిజన్ కొరతే కారణం కాదు
► సీఎస్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు
► నివేదిక వచ్చాక కఠిన చర్యలు
► చిన్నారుల మృతి కలచివేసింది: యూపీ సీఎం యోగి
► ఆరు రోజుల్లో 60 మంది చిన్నారుల మృతి
► మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్‌దాస్ (బీఆర్‌డీ) వైద్య కళాశాలలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆగస్టు 11న ఆక్సిజన్ కొరత కారణంగా ప్రెజర్ కాస్త తగ్గినప్పటికీ చిన్నారుల మృతికి ఇదే కారణం కాదన్నారు. శనివారం లక్నోలో మీడియా సమావేశంలో యోగి మాట్లాడుతూ.. చిన్నారుల మృతి తనను కలచివేసిందని పేర్కొన్నారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసినట్లు తెలిపిన యోగి.. నివేదిక అందిన తర్వాత బాధ్యులెంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ విచారణలో ఆక్సిజన్ కొరతే కారణమని తేలితే అంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు.
ఆగస్టు 7 నుంచి వివిధ వ్యాధుల కారణంగా ఇదే ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు చనిపోయారని రాష్ట్ర వైద్య మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అటు, సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగటంతో ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గోరఖ్‌పూర్ ఆసుపత్రి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే!
గోరఖ్‌పూర్ ఘటనలో రాష్ట్రప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రభుత్వ భారీ నేరపూరిత నిర్లక్ష్యం వల్లే 60 మంది చిన్నారులు చనిపోయారని ఎస్పీ, బీఎస్పీ విమర్శించాయి. ‘ఆరేడు రోజుల్లో 60 మంది చిన్నారులు చనిపోవటం చాలా బాధాకరం. ఇది బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యపు పాలనకు ఉదాహరణ. యోగికి ప్రజా సంక్షేమం పట్టదు’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యతని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
ఆక్సిజన్ సరఫరాలో లోటుపాట్ల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ‘ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసే సంస్థ.. బకాయిలు చెల్లించకుంటే సరఫరా నిలిపేస్తామని మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ముందే సూచించినా సర్కారు స్పందించలేదు’ అని అఖిలేశ్ విమర్శించారు. శనివారం బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజీని సందర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. చిన్నారుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం యోగి రాజీనామా చేయాలని ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ డిమాండ్ చేశారు.
చర్యలు షురూ..
గోరఖ్‌పూర్ ఘటన బాధ్యులపై యూపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చిన్నారుల మృతికి కేంద్ర బిందువైన బీఆర్డీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ సస్పెండ్ చేసింది. ‘బకాయిలు చెల్లించాలంటూ ఆగస్టు 1న ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాదారు ప్రిన్సిపాల్‌కు లేఖరాశారు.
ఈ లేఖను వైద్య విద్య శాఖ డైరెక్టర్ జనరల్‌కు పంపించగా.. ప్రభుత్వం ఆగస్టు 5న బకాయీలను విడుదల చేసింది. కళాశాల అకౌంట్లోకి ఆగస్టు 7న డబ్బులొచ్చినా.. ఆగస్టు 11 వరకు ఆ సరఫరాదారుకు డబ్బులు చెల్లించలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అని యూపీ వైద్య విద్య శాఖ మంత్రి అశుతోశ్ టాండన్ పేర్కొన్నారు. కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి అనుప్రియా పాటిల్ (యూపీ) కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
నేను పదే పదే అడిగా.. అయినా!
‘చిన్నారుల మృతి వేదన కలిగించింది. మెదడువాపు వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని ముందునుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాను. ఆగస్టు 9న వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించాను. మెదడువాపు, డెంగ్యూ, దొంగజ్వరం, స్వైన్ ఫ్లూ, చికున్‌గున్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించాను. బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, పీడియాట్రిక్ వార్డు ఇన్‌చార్జ్‌లతో మాట్లాడా. సంసిద్ధత కోసం ప్రభుత్వం నుంచి ఇంకేమేం కావాలని అడిగాను. అప్పుడు కూడా ఆక్సిజన్ కొరత గురించి నాకు చెప్పలేదు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన వివరణ అడిగారు’.