- రైతులకు మంత్రుల హామీ
- వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల పరిశీలన
సిరికొండ : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భరోసా ఇచ్చారు. మండలంలోని కొండూర్, న్యావనంది, చిన్నవాల్గోట్ గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, సజ్జ, నువ్వు పంటలను మంత్రులు గురువారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవమేనన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పంటల నష్టానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం చెల్లించామని తెలిపారు.
అకాల వర్షాలతో బుధవారం వరకు జిల్లాలో 13300 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని, గురువారం కూడా వర్షం కురుస్తున్నందున నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని తప్పనిసరిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన కొండూర్ గ్రామ రైతులు గోపాల్, గంగయ్యలు మంత్రి పోచారంతో మాట్లాడారు. తాము కొన్నేళ్లుగా పంటల బీమా చెల్లిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పరిహారం చెల్లించడం లేదని రైతులు వాపోయూరు. మండలాల వారీగా బీమా ఉండటంతో పరిహారంలో నష్టపోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతు గత ఏడాది రాష్ట్రం ఏర్పడకముందే రబీలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయూయని, అటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు.
పంటలు పండినా అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ సుమనారెడ్డి, జేడీఏ నర్సింహ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు తోట రాజన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అధైర్యపడొద్దు..ఆదుకుంటాం..
Published Fri, Apr 17 2015 2:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement