సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణాలోని పలుజిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. శ్రీశైలంలో గాలివానకు కారుపై భారీ వృక్షం విరిగిపడింది. అయితే కారులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
భద్రాద్రి, జనగామ, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణ్‌ఖేడ్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో భారీ వర్షం కురుస్తోంది. కరీంనగర్‌లో పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. వడగళ్ల వానతో పలుజిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన ధాన్యం తడవడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణకేం ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
►ఎన్టీఆర్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వాన బీభత్సం
►నిజామాబాద్‌లోని సిరికొండలో ఈదురుగాలులతో కూడిన వర్షం.
►ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం.
►కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పెట్టులో వడగళ్ల వాన
►ప్రకాశం జిల్లా దర్శిలో ఈదురుగాలులతో భారీ వర్షం
►విజయవాడలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
►పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం
►వినుకొండలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 31 నుంచి 21 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలతిపింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా మాల్దీవుల నుంచి కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుండగా.. ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు, పిడుగులు పడతాయని చెబుతున్నారు. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు పొలం పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment