సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన పడింది. దీంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, పసుపు, మిర్చి, అరటి పంటలు నేలవాలాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన సీతారాములు పట్టాభిషేకం భారీ కటౌట్ కుప్పకూలింది.
జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా వర్షపాతం నమోదయ్యింది. జగిత్యాల జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొక్కజొన్న, పసుపు, మిర్చి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడిచెట్ల పూత రాలిపోయింది. మేడిపల్లి మండలం గోవిందారంలో 68.0 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం వడగళ్ల వాన దంచి కొట్టింది. దీంతో కూరగాయల తోటలు, నాటు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి.
జిల్లాలో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా జన్నారం, భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, మంచిర్యాల మండలాల్లో వర్షం కురిసింది. జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానలో గాయపడిన పెంద్రం రాజు పటేల్ (55) మంగళవారం చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాలో కంది, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగు కట్ట తెగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో వడగళ్ల వాన పడింది. పాలమూరులో భారీ వర్షం కురిసింది. ఇక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment