విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న సహాయకసిబ్బంది
డ్యురాంగో: భారీ వడగళ్ల వానకు ఉత్తర మెక్సికోలో ఏరోమెక్సికోకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. డ్యురాంగో నుంచి మెక్సికోకు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వడగళ్ల వానలో విమానం చిక్కుకుంది. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో విమానం కుప్పకూలింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 99 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇద్దరు విమాన సిబ్బంది కలిపి మొత్తం 103 మంది అందులో ఉన్నారు. వారిలో 97 మందికి గాయాలయ్యాయి. పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. విమాన సిబ్బంది ఎంతో చాకచక్యంగా, నేర్పరితనంతో విమానాన్ని భారీ ప్రమాదం నుంచి తప్పించారని ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ జనరల్ ఆండ్రెస్ కొనేసా అభినందించారు.
విమానం భద్రతా ప్రమాణాల వల్లే..
ఏరోమెక్సికో విమాన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడానికి కారణం దాన్ని తయారుచేసిన విధానం, భద్రతా ప్రమాణాల వల్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. విమానం లోపలి భాగాలు మంటలు అంటుకుని కాలిపోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కాకపోవడం వల్లే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment