సాక్షి, అమరావతి: దేశంలో వడగాడ్పుల తీవ్రత, మరణాలపై గడిచిన తొమ్మిదేళ్లకు సంబంధించి ఇటీవల కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. 2015 నుంచి 2023 వరకు రాష్ట్రాల వారీగా లెక్కలను ఆ నివేదికలో వెల్లడించింది. సంవత్సరాల వారీగా చూస్తే 2015 నుంచి 2019 వరకు వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్‌లో 2,418 మంది మరణించారు. 2015లోనే అత్యధికంగా ఏపీలో 1,422 మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2020 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో వడగాడ్పులకు ఐదుగురు మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
మన రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావం తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి వేసవి గాలులపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు, సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలను పంపించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోందని నివేదిక పేర్కొంది.
వడగాడ్పులకు చికిత్స ద్వారా సంబంధిత మరణాలను తగ్గించడానికి మౌలిక సదుపాయాలను 28 రాష్ట్రాల్లో కల్పించినట్లు తెలిపింది. భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలను ముందస్తుగా జారీ చేస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment